17-10-2025 01:14:44 AM
మేడ్చల్, అక్టోబర్ 16(విజయ క్రాంతి): మేడ్చల్ ఎక్సుజ్ సూపరిండెంట్ పరిధిలో మద్యం దుకాణాల టెండర్ కు స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. గతంలో మాదిరి ఆశావహులు దరఖాస్తు చేయడానికి ముందుకు రావడం లేదు. కొత్తవారు టెండర్ వేయడానికి భయపడుతున్నారు. మేడ్చల్ ఈఎస్ పరిధిలో 118 దుకాణాలకు ఇప్పటివరకు 1300 లోపే దరఖాస్తులు వచ్చాయి. గతంలో 7519 దరఖాస్తులు వచ్చాయి.
15వ తేదీ వరకు కేవలం 1010 దరఖాస్తులు మాత్రమే రాగా, గురువారం 250 నుంచి 300 మధ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల దాఖలకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. 18వ తేదీన బంధు ఉన్నందున శుక్రవారం మాత్రమే సమయం ఉంది. శనివారం కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు కానీ బ్యాంకులు బంద్ చేసే అవకాశం ఉంది. శుక్రవారం డీడీలు తీసుకోవాల్సి ఉంటుంది.
అంచనాలు తారుమారు
మద్యం దుకాణాలకు గతంలో మాదిరి భారీ డిమాండ్ ఉంటుందని ఎక్సుజ్ అధికారులు, ప్రభుత్వం భావించినప్పటికీ, ప్రస్తుతం అంచనాలు తారుమారు అయ్యాయి. దరఖాస్తు తో పాటు మూడు లక్షల రూపాయల డిడి సమర్పించాలి. రియల్ వ్యాపారం కుదేలు కావడం వల్లే మద్యం దుకాణాలకు స్పందన లభించడం లేదని తెలుస్తోంది.
రియల్ వ్యాపారం జోరుగా ఉంటే దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుంది. రియల్ వ్యాపారం లేనందున మద్యం దుకాణాలు, బార్లకు గిరాకీ తగ్గింది. అంతేగాక డ్రాలో మద్యం దుకాణం రాకుంటే మూడు లక్షలు వాపస్ రావు. వాస్తవానికి గతంలో రెండు లక్షల రూపాయల డిడి సమర్పించేవారు. దానిని ప్రభుత్వం మూడు లక్షలకు పెంచింది. దరఖాస్తులు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది.
దరఖాస్తుల సంఖ్య పెరిగింది
మద్యం దుకాణాలకు దరఖాస్తుల సంఖ్య పెరిగింది. గురువారం 300 దరఖాస్తులు వచ్చాయి. మరో రెండు రోజులు గడువు ఉన్నందున భారీ సంఖ్యలో దరఖాస్తుల వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ వారే గాకుండా ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వ్యాపారులు కూడా మద్యం టెండర్లలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు.
కుతుబుల్లాపూర్ పరిధిలో ఒక మద్యం దుకాణానికి ఇప్పటికే 37 దరఖాస్తులు వచ్చాయి. శనివారం బంద్ దృష్ట్యా టెండర్ లో పాల్గొనేవారు ముందుగానే డీడీలు తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తాం.
- ఎస్ కె ఫయాజుద్దీన్, ఈ ఎస్, మేడ్చల్