27-09-2025 12:41:15 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బంగాళ ఖాతంలో ఏర్పడిన ద్రోణి వాయుగుండంగా మారే అవకా శం ఉందని, లోతటు ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వరద నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, రోడ్లపై వరద చేరి వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీ కంపెనీ యాజమా న్యాలు టెకీలకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప రావొద్దని సూచించారు. వైద్యారోగ్యశాఖ అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమన్వయంతో పనిచేయాలి: మంత్రి పొంగులేటి
రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లతోపాటు అన్నిశాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిపారుదల, రవాణా, విద్యుత్, హైడ్రా, జీహెచ్ ఎంసీ, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఉండొద్దని హెచ్చరించారు. దసరాకు హైదరాబాద్ నుంచి భారీ గా ప్రజలు సొంత గ్రామాలకు వెళతారని, వారికి సరైన రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లోకి భారీగా వరద చేరుతున్నందున దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైతే వారి కోసం షెల్టర్ హోమ్స్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజలు జలాశయాలు, జల వనరుల వద్దకు వెళ్లకుండా కంచె వేయాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రెస్క్యూ ఆపరేషన్ బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.