calender_icon.png 12 January, 2026 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం.. జనసంద్రం..

12-01-2026 01:27:51 AM

ములుగు, జనవరి11 (విజయక్రాంతి): ఆదివారం రోజున మేడారం మహాజాతర ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే జంపన్నవాగు వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పవిత్రతను సంపాదించుకున్న అనంతరం వనదేవతలు సమ్మక్కసారలమ్మలను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబ శ్రేయస్సు, పంటల సుఖసమృద్ధి, ఆరోగ్యకాంక్షలతో చేసిన మొక్కులను చెల్లించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ భక్తిభావంతో జాతరలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఘనంగా తీర్చిదిద్దారు. అడవుల మధ్యలో వెలిసిన మేడారం పుణ్యక్షేత్రం భక్తుల నామస్మరణలు, పూజలతో మారుమ్రోగింది. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో పోలీసులు, వైద్య శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాయి. ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్య ఏర్పాట్లు సమర్థంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మేడారం జాతర సందర్భంగా ఏర్పడిన ఈ జనసంద్రం వనదేవతలపై ప్రజలకు ఉన్న అపారమైన భక్తిని మరోసారి చాటింది. భక్తులు ఆనందోత్సాహాలతో జాతరలో పాల్గొంటూ మేడారం మహిమాన్వితతను మరింత పెంచారు.