13-09-2025 03:01:30 AM
వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 12( విజయక్రాంతి): మండల కేంద్రంలోని కోతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గ్యానం వాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం బృందం ఫారెస్ట్ కార్యాలయంలో ఫారెస్ట్ సిబ్బందికి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్యానం వాసు మాట్లాడుతూ మండల కేంద్రంలో కోతుల సమస్యతో గడిచిన మూడు సంవత్సరాల నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు ఎటువంటి చొరవ చూపలేదని ఆరోపించారు.
ఉదయం 5 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతి ఇల్లు కోతుల సమస్యతో బాధపడుతున్నారని, ఇంట్లో నిత్యావసర వస్తువులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సుదూర ప్రాంతాల నుండి కోతులను తీసుకొచ్చి మండల కేంద్రంలోని గ్రామ శివారులలో వదిలి వేయడం వల్ల వందలాది కోతులు ఊర్లో స్త్వ్రర విహారం చేస్తున్నాయని ఆరోపించారు. ఇళ్లల్లోకి చొరబడి ఇంట్లో ఉన్న సామాన్లని ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు, రైతులు పెరట్లో కూరగాయలను పెంచుకుంటే కోతులు వాటిని ధ్వంసం చేస్తున్నాయని, కోతుల వలన ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు లభించే పరిస్థితి లేదని అన్నారు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రజలందరూ కోతుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోతుల సమస్యపై సిపిఎం పార్టీ దశల వారి పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. మండల నాయకులు కట్ల నరసింహాచారి, కోగిల మాణిక్యం, నాగేశ్వరరావు, కురసం మల్లయ్య, మీడియం నగేష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు