calender_icon.png 13 September, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతిని నిలదీస్తే దాడి! మణికొండలో మాజీ కౌన్సిలర్ వీరంగం

13-09-2025 02:56:36 PM

రసాభాసగా కాలనీ సర్వసభ్య సమావేశం

మణికొండ (విజయక్రాంతి): ప్రశాంతతకు మారుపేరైన మణికొండలో ఓ కాలనీ సర్వసభ్య సమావేశం రణరంగాన్ని తలపించింది. అక్రమాలు, అవినీతిని ప్రశ్నించినందుకు ఓ మాజీ కౌన్సిలర్ పట్టపగలే వీరంగం సృష్టించారు. సభ్యుల ముందే ఓ కాలనీ వాసిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడి పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ(Manikonda Municipality) పరిధిలోని వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒక్క సమావేశం నిర్వహించలేదని, సుమారు రూ. 2 కోట్లు వసూలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని అధ్యక్షుడు ఉపేంద్ర రెడ్డి, ఇతర సభ్యులను కొందరు కాలనీవాసులు నిలదీశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో మాజీ కౌన్సిలర్ పద్మ రావు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.

వేదికపై నుంచి దూకి, అవినీతిపై గళమెత్తిన రాజ్ కుమార్ అనే వ్యక్తిపై బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. తన చేతికి ఉన్న కడియంతో రాజ్ కుమార్ తలపై బలంగా కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. అడ్డువచ్చిన వారిని సైతం తోసివేస్తూ పద్మ రావు, అతని అనుచరులు సుమారు పది మంది పిడిగుద్దులు కురిపించారు. మరికొందరు కర్రలతో వచ్చి భయానక వాతావరణం సృష్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అసోసియేషన్ పేరుతో కొందరు పెద్దలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ దాడి ఘటనతో అసోసియేషన్ రెండుగా చీలిపోయింది. తమకు న్యాయం చేయాలని, అసోసియేషన్ అక్రమాలపై విచారణ జరిపి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.