13-09-2025 03:14:15 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కేవలం మెట్రోపాలిటన్ పట్టణాలకు మాత్రమే పరిమితమైన మిక్స్(మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ) స్థానిక రెనే హాస్పిటల్(Renee Hospital)లో సీనియర్ రోబోటిక్ & మిక్స్ కార్డియోథొరసిక్ సర్జన్ డా.రవికుమార్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా డా.రవికుమార్ మాట్లాడుతూ, అతి చిన్న కోత ద్వారా గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయడం దీని ప్రత్యేకత. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకి చెందిన అజయ్ కుమార్ అనే 15 సంవత్సరాల బాలుడు పుట్టుకతోనే గుండెలో రంధ్రం కలిగి ఉండడం వల్ల గత 15 సంవత్సరాలుగా ఆయాసం రావడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడం గుండెదడ, బరువైన పనులు చేయలేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడడం జరిగింది. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ గుండె ఆపరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ జరిగిన కేవలం మూడు రోజుల్లోనే పేషెంట్ తన బాధ నుండి పూర్తిగా కోలుకొని గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోవడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా రెనే హాస్పిటల్స్ అధినేత ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి మాట్లాడుతూ.. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా నేడు కరీంనగర్ స్థాయిలోనే ఇంత అధునాతనమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలియాలని ఇలాంటి అధునాతనమైన ఆపరేషన్ చేయాలంటే అత్యధిక సదుపాయాలతో కూడిన హాస్పిటల్ తో పాటు ఎంతో అనుభవం కలిగిన రోబోటిక్ & మిక్స్ కార్డియోథొరసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ లాంటి వైద్యులు ఉండడం అనేది అవసరం అని అన్నారు. నేడు వైద్యం అనేది ఐ టెక్నాలజీ ద్వారా ఎంతో పురోగతి సాధించడం జరుగుతోందని, ఎక్కడో విదేశాల్లో ఉండి కేవలం టెక్నాలజీ ద్వారా ఈ దేశంలో ఆపరేషన్లు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఆపరేషన్లు మన ప్రాతంలో చేయాలనే ఒక విజన్ తో రెనే హాస్పిటల్ ముందుకు వెళ్తూ, సామాన్యులకు కూడా అధునాతన వైద్యం అందించాలని అని మా హాస్పిటల్ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.దినకర్ తాటిమట్ల, పిల్లల గుండె వైద్య నిపుణులు డా.రాజా విజయేందర్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డా.రవీంద్రా చారి, హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్ బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ లతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.