20-05-2025 05:08:50 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణం మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ దాటేందుకు అండర్ డ్రైనేజీలో ఉన్న మట్టిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కాజీపేట విజయవాడ సెక్షన్ లో మూడో రైల్వే లైన్ నిర్మాణం కోసం కొంతకాలం క్రితం మూడో లైన్ నిర్మాణ ప్రదేశంలో కల్వర్ట్ నిర్మాణం కోసం అండర్ డ్రైనేజీ నుండి రాకపోకలు పెట్టు వేశారు. ఇటీవల కొత్తగా మూడో లైన్ వేయడానికి అండర్ డ్రైనేజీ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే అందులో నుండి రాకపోకలు సాగించకుండా ఇరువైపులా మట్టి కుప్పలు పోశారు. అండర్ డ్రైనేజీ కల్వర్టు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో మట్టి తొలగిస్తే ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు రైల్వే ట్రాక్ దాటడానికి అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. రైల్వే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి మట్టి తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.