03-01-2026 12:00:00 AM
రాజధానికి చేరిన టికెట్ల పంచాయతీ
టికెట్ల కోసం ఎవరికి వారే సత్తా చాటుకుంటున్న అభ్యర్థులు
డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన మున్సిపల్ శాఖ, నేడో, రేపు నోటిఫికేషన్
మహబూబ్ నగర్, జనవరి 2(విజయక్రాంతి): మరి కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలలో ఆశావాహుల ఒత్తిడి అయింది. టికెట్ కోసం ఎవరికి వారు జోరుగా లాబింగ్ చేస్తూ రాజధానికి పంచాయతీ చేరింది. ఒకరు ఒక నేతను సంప్రదిస్తే మరొకరు మరో నేతతో టికెట్ కోసం పోటీపడుతూ ఒక్కొక్క వార్డులో అన్ని పార్టీలలో ముగ్గురు నుంచి ఐదుగురు పోటీ పడడం అన్ని పార్టీలలో టికెట్ల తలనొప్పి తారస్థాయికి చేరింది. మున్సిపాలిటీల కౌన్సిల్ పదవి కాలం పూర్తి అయి ఏడాది కావడంతో ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్న నేతలు టికెట్ల కోసం ఇప్పుడు భారీగా పోటీ పడుతున్నారు. పదవే లక్ష్యంగా ఎవరికి వారే పావులు కదుపుతూ రాజకీయ వేడిని తారస్థాయికి తీసుకువచ్చారు.
ప్రతిరోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రధాన పార్టీలలో జోరుగా టికెట్ల మంతనాలు జరుగుతున్నాయి. ప్రధాన నాయకులు తమ క్యాడర్ కు టికెట్లు ఇప్పించాలని ఉద్దేశంతో రాజధానిలో అధిష్టానం దగ్గర ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లను కైవసం చేసుకునేందుకు దృష్టి సాధించింది.
ఇందుకుగాను ప్రధాన క్యాడర్ ను అప్రమత్తం చేసి టికెట్లు ఇచ్చేందుకు అభ్యర్థుల ఎంపికను వేగవంతంగా పూర్తి చేస్తుంది. ఇక ప్రతిపక్ష పార్టీల సైతం అధికార పార్టీని ఢీకొట్టేందుకు దీటుగా రెడీ అవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ వేడి బగ్గు మంటుంది. అభ్యర్థులు టికెట్లు పొందుకొని గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రభావితం చేసే పనిని వేగవంతం చేశారు.
పాలమూరు మేయర్ జనరల్ కే?
ఇటీవల పాలమూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అవతరించడం 60 డివిజన్లతో అతి పెద్దగా ఏర్పాటు అయింది. పెద్ద కార్పొరేషన్ పై తమ జెండాను ఎగరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన దృష్టి సారించింది. ఇందులో భాగంగా చురుకైన అభ్యర్థిని మేయర్ గా పెట్టి కార్పొరేషన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు జిల్లా వాసి అయిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. మేయర్ అభ్యర్థుల విషయానికి వస్తే ప్రధానంగా మారేపల్లి సురేందర్ రెడ్డి తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ లు పోటీ పడుతున్నారు. 60 డివిజన్ లో మ్యాజిక్ ఫిగర్ 31 సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది.
ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్‌ఎస్ గతసారి మున్సిపాలిటీపై తామే జెండా ఎగరవేశామని ఈసారి కూడా తామే జెండా ఎగురవేయాలని ధీమాతో ప్రచారం చేసుకుంటుంది. బీఆర్‌ఎస్ నుంచి మేయర్ అభ్యర్థి విషయానికి వస్తే బరిలో ఎవరు ప్రచారంలో లేకపోవడంతో మాజీ చైర్మన్ అయిన కొరముని నర్సింలే అభ్యర్థినిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే సెకండ్ క్యాడర్ పై కొనసాగిన నేతలంతా కనిపించకుండా పార్టీకి దూరంగా ఉండటంతోపాటు మరి కొంతమంది ఇతర పార్టీలకు వలసలు వెళ్లారు.
దీంతో కోరమని నరసింహులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఎలాంటి ఫిర్యాదులు, రిమార్కులు లేకుండా కొనసాగిన నరసింహులు పట్ల మాజీ మంత్రి సైతం సాల్కూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనదైన శైలిలో పావులు కదుపుతూ అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నా సందర్భాలు లేకపోలేదు. అప్పుడప్పుడు మీడియా సమావేశంలో అధికార పార్టీపై విరుచుకుపడుతూ తన కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసుకుని గెలుస్తామని ధీమాను ప్రదర్శిస్తున్నారు.
నేడు.. రేపు నోటిఫికేషన్..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ శాఖ ఈనెల 1వ తేదీన ఓటర్ గ్రాఫ్టును రిలీజ్ చేసింది. సవరణలకు ఈనెల 5వ తేదీన వరకు గడువు విధించింది. ఐదున అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారితో సలహాలు సందేహాలు సూచనలు తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది. ప్రస్తుత స్పీడును చూస్తే 6 లేదా 7వ తేదీ న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఈ వేగాన్ని చూసి అభ్యర్థుల సైతం అంతే వేడిగా టికెట్ల కోసం ఆయా పార్టీలలో రచ్చ రగిలిస్తున్నారు.