03-01-2026 12:00:00 AM
తహసీల్దార్‌కు గ్రామస్తుల వినతి
రామాయంపేట, జనవరి 2 : గొల్పర్తి గ్రామాన్ని ప్రత్యేక వార్డుగా ఏర్పాటు చేయడంతో పాటు ఈసారి తప్పనిసరిగా బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని కోరుతూ గ్రామ ప్రజలు రామాయంపేట తహసిల్దార్ రజని కుమారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రస్తుతం గొల్పర్తి గ్రామం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుగా కొనసాగుతోందని తెలిపారు. గ్రామంలో సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉన్నప్పటికీ, తమ గ్రామానికి చెందిన కొంతమంది ఓట్లను 2వ వార్డుకు కలపడంతో పాటు, రామాయంపేటలోని శ్రీరాం నగర్ కాలనీ, ఎస్.సి. కాలనీకి చెందిన ఓట్లను 7వ వార్డులో కలిపారని పేర్కొన్నారు. దీంతో వార్డు నిర్మాణంలో అసమతుల్యత ఏర్పడిందని, పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు.
రామాయంపేట, కోమటిపల్లి గ్రామాలకు సరైన లింక్ లేకుండా గొల్పర్తి గ్రామం విడివిడిగా ఉన్నందున, ప్రజలకు మెరుగైన పరిపాలనా సౌకర్యాల కోసం 7వ వార్డును పూర్తిగా గొల్పర్తి గ్రామానికే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే గత 20 సంవత్సరాలుగా తమ గ్రామానికి ఎప్పుడూ ఎస్.సి. రిజర్వేషన్ మాత్రమే వర్తిస్తున్నదని, అయితే గ్రామంలో 95 శాతం మంది బీసీ వర్గాల ప్రజలేనని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల తమకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో గ్రామానికి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడంతో పాటు, ఈసారి తప్పనిసరిగా బీసీ రిజర్వేషన్ ప్రకటించాలని కోరారు.