16-07-2025 12:00:00 AM
మహబూబాబాద్, జూలై 15 (విజయ క్రాంతి): మున్నేరు ప్రాజెక్టు అభివృద్ధి పనులను చేపట్టాలని, డోర్నకల్, గార్ల, బయ్యారం మండల ప్రాంత ప్రజలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గార్లలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, బండారి ఐలయ్య, జడ సత్యనారాయణ, నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1969 లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మున్నేరు ప్రాజెక్ట్ కోసం నిధులు మంజూరు చేయగా తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం,
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప, ప్రశాబ్దాల తరబడి మున్నేరు ప్రాజెక్టు అభివృద్ధికి నోచుకోవడం లేదని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముందేరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మున్నేరు నీటిని ఇతర ప్రాంతాలకు కాకుండా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నీరు ఇస్తామని డిపిఆర్ లో పెట్టి, ఇప్పుడు గార్ల బయ్యారం మండలాలను తొలగించి, సుదూర ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించుకు వెళ్లి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
మున్నేరు ద్వారా నీటి విడుదల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సక్రు నాయక్, మనోహర్, భద్రయ్య, మల్లేష్, గణేష్, వెంకటేశ్వర్లు, బాబురావు, సైదమ్మ, కొండలరావు పాల్గొన్నారు.