లాయర్ దంపతుల హంతకులను వదలం

25-04-2024 02:31:00 AM

l చట్టం ఎవరికీ చుట్టం కాదు.. నేరస్తులకు శిక్ష పడేలా చూస్తాం

l కమిషన్ల కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగుబాటు

l ఓడేడు వంతెన గాలికే కూలింది

l అక్రమార్కులను వదిలిపెట్టం

l రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, ఏప్రిల్ 24 (విజయకాంత్రి): న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతులను నడిరోడ్డుపై హత్యచేసిన నిందితులకు చట్ట పరిధిలో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, చట్టం ఎవరికీ చుట్టం కాదని నేరస్తులకు శిక్ష తప్పదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన వారు, కమిషన్లకు కక్కుర్తి పడిన అక్రమార్కులను ఎవరినీ వదిలిపెట్టమని ప్రకటించారు.

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన సుమారు 200 మంది బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ కుంగిపొయిందని, రూ.50 కోట్లతో ముత్తారం మండలం ఓడేడులో మానేరుపై నిర్మించిన బ్రిడ్జి పేకమేడలా కూలిపోయిందని మండిపడ్డారు. కమిషన్లకు కక్కుర్తి పడడంతోనే ఇలాంటి నాసిరకమైన నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మితమవుతున్నా యన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్లు గోదావరి పాలయ్యాయన్నారు. ఆ సొమ్ముతో ప్రజలు డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యేవన్నారు. ప్రజలందరికీ తెల్ల రేషన్‌కార్డులు అందేవన్నారు.

గాలికి ఓడేడు వంతెన కూలిపోయిందంటే నాణ్యత ప్రమాణాలు ఎంతమేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజల సొమ్మును సంక్షేమ పథకాలకు ఖర్చు చేయకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు, వంతెనల పేరుతో దోచుకున్నదని, ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు. మంత్రి వెంట పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్‌రావు, మంథని మున్సిల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాదేవి, కాంగ్రెస్ నేతలు తొట్ల తిరుపతి యాదవ్, నైనాల రాజు, ఐలి ప్రసాద్, గంట రమణారెడ్డి, ముసుకుల సురేందర్‌రెడ్డి, మోహన్, లింగయ్య యాదవ్, రాజేష్, కుమార్ పాల్గొన్నారు.