01-12-2025 05:59:59 PM
చిట్యాల (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా నియమించిన నూతన రేషన్ డీలర్ ను తొలగించి నోటిఫికేషన్ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని కోరుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ నేత కునూరు సంజయ్ దాస్, బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ లు సోమవారం మండల ఇన్చార్జి తహసిల్దార్ విజయకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఐదవ రేషన్ డీలర్ ను నోటిఫికేషన్ వేయకుండా, ఎలాంటి అర్హత పరీక్షలు నిర్వహించకుండా, ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా స్థానికేతర్లను డీలర్ గా నియమించడం చట్ట విరుద్ధమని దీనిని వెంటనే రద్దుచేసి నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్ వేసి అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే చిట్యాల పట్టణ కేంద్రంలోని 4వ డీలర్ గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నప్పటికీ మూడవ డీలర్కే అదనపు బాధ్యతలు అప్పజెప్పి నడిపిస్తున్నారని దీనివల్ల వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే నాలుగో షాపు డీలర్ ను నియమించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.