01-12-2025 06:27:59 PM
జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు పాఠశాలలలో ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ నెల 8వ తేదీ లోగా అన్ని ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలలో నిపుణులతో కెరీర్ గైడెన్స్ పై కౌన్సిలింగ్ అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రూప్ 1 అధికారులు, ఇతర అధికారులు తాము ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన తీరు, పోటీ పరీక్షలకు సన్నద్ధమైన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ దిశగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారు మయంగా మలుచుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, ఎస్.ఓ. దేవాజీ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.