రెండో విడతలో.. నిపుణులు

27-04-2024 02:11:13 AM

n  కాళేశ్వరంపై మూడో రోజూ కొనసాగిన కమిషన్ విచారణ

n రికార్డులపై మరోసారి అధికారులకు సూచనలు n  నేడు కొల్‌కత్తాకు జస్టిస్ పీసీ ఘోష్

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కాళేశ్వరం  ప్రాజెక్ట్ అవినీతిపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మూడోరోజు శుక్రవారం విచారణ కొనసాగించింది. బీఆర్‌కే భవన్ 8వ అంతస్తులోని తన కార్యాలయంలో అధికారులతో రోజంగా కమిషన్ చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను కమిషన్ ఆరా తీసింది. ఏయే రికార్డులు కావాలనే దానిపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులు కమిషన్‌కు కావాల్సిన సమాచారాన్ని, దాఖలు పర్చాల్సిన రికార్డులపై చర్చించారు.

మే మొదటివారంలో తిరిగి రాక..

ఇదిలా ఉండగా.. మూడు రోజుల పర్యటన ముగించుకుని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం ఉదయం తిరిగి కొల్‌కత్తా వెళ్ళనున్నారు. తిరిగి మే నెల మొదటి వారంలో రెండోసారి హైదరాబాద్‌కు కమిషన్ రానున్నారు. అయితే ఈసారి వచ్చేటప్పుడు పలువురు నిపుణులు కమిషన్ వెంట రానున్నారు. ఇందులో ఇద్దరు ఐఐటీ ల నుంచి సాంకేతిక ప్రొఫెసర్లు ఉండనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఒకరిద్దరు ఇంజనీర్లు, ఒకరిద్దరు సీఏలు, ఆడిటర్లు.. ఇలా పలు అంశాలకు సంబంధించిన నిపుణులను కమిషన్ తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఈలోగా అధికారులు అన్ని రకాల రికార్డులను అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు. రెండో విడత వచ్చిన వెంటనే నిపుణులు ఆయా రికార్డులను పరిశీలించడంతోపాటు.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనుకూడా కమిషన్‌తోపాటు వెళ్ళి పరిశీలించనున్నారు.

దీనితో ఎక్కడెక్కడ ఏమేం జరిగింది.. ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి.. ఎక్కడ ఎవరి బాధ్యత ఉందనేదానిపై ప్రాథమికంగా ఒక అవగాహన కల్గుతుందని కమిషన్ భావిస్తోంది. అలాగే.. కాళేశ్వరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచి సమాచారం సేకరిస్తానని ఇప్పటికే ప్రకటించిన కమిషన్.. రెండో విడతలో ఇలా సంబంధం ఉన్నవారందరినీ ఒక జాబితాగా రూపొందించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. వారికి నోటీసులు పంపించి.. వారినికూడా పిలిచి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. శనివారం ఉదయం తన మొదటి విడత పర్యటనను ముగించుకుని కమిషన్ కొల్‌కత్తాకు వెళ్ళనుంది.