26-11-2025 12:00:00 AM
- సిద్దిపేటలో రిజర్వేషన్లు ఖరారు
- జిల్లాలో మొత్తం 508 జీపీలు,4508 వార్డులు
- ఆశావాహుల్లో రిజర్వేషన్ల నిరాశ
- ఎన్నికల షెడ్యూల్ కోసం పల్లెలు ఎదురుచూపులు
నంగునూరు, నవంబర్ 25: సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు కు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. సుప్రీం, హైకోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50% మించకుండా డిసెంబరులో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర మం త్రివర్గం తీర్మానించింది. ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయడంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను ముమ్మ రం చేసింది. జిల్లాలో మొత్తం 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డు స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ హేమవతి సోమవారం అధికారిక గెజిట్ ను విడుదల చేశారు.
ఆశావహులకు నిరాశ
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీ రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ జనాభా లెక్కల ప్రకారం ఖరారు చేశారు. సెప్టెంబరులో బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం కేటాయించిన స్థానాలు ఇప్పుడు మారడంతో, ఆశావహుల్లో నిరాశ ఏర్పడింది. నాయకులు ఎన్నికలపై గంపెడు ఆశతో ఎదురుచూస్తూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గ్రామాల్లోని ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, యోగక్షేమాలను తెలుసుకుంటూ, సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
ముమ్మరమైన రాజకీయ ప్రయత్నాలు..
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతు కూడగట్టి బరిలోకి దిగుతున్నారు. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పోరులో ప్రజలు పార్టీలకు అతీతంగా, అభ్య ర్థి వ్యక్తిగత సామర్థ్యాన్ని చూసి ఎన్నుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. నాయకులు కూడా ఓటర్లలో సానుభూతిని పెంచేందుకు వ్యూహాలు రచిస్తూ, పార్టీ మద్దతు కోసం, క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడానికి ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పల్లెల్లో రాజకీయ సందడి పతాక స్థాయికి చేరుకుంది.