13-12-2025 06:07:13 PM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..
పోలింగ్ డిస్ట్రిబ్యూషన్/రిసెప్షన్ కేంద్రాల పరిశీలన..
నారాయణపేట (విజయక్రాంతి): జిల్లాలో రెండవ విడతలో ఆదివారం నారాయణ పేట, దామరగిద్ద, ధన్వాడ మరికల్ మండలాల పరిధిలోని గ్రామాలలో నిర్వహించునున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు-2025లో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ధన్వాడ, నారాయణపేట పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్/ రిసెప్షన్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతి కౌంటర్ ను, ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మొదటి విడత పోలింగ్ లో విధులు నిర్వహించిన వారిలో కొందరు రెండో విడత పోలింగ్ విధులకు నియమింప బడ్డారని, తొలి విడత ను విజయవంతంగా ముగించిన విధంగానే రెండో విడత పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా చెక్ చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ను పర్యవేక్షించే అవకాశం ఉందని, పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలను ఎవరూ ఆఫ్ చేయవద్దని ఆమె సూచించారు. పోలింగ్ కేంద్రాల లోపలికి పోలీసులు వెళ్లరాదని, కేంద్రాల ఆవరణలోనే బందోబస్తు చేయాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు.
రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది చెక్ లిస్ట్ ప్రకారం తమకు అందజేసే సామాగ్రిని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అదనపు సామాగ్రి ఆర్.ఓ జోనల్ అధికారుల వద్ద ఉంటుందని అవసరమైన వారు ఆయా అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఫామ్ 9 ప్రకారం సిబ్బంది తప్పనిసరిగా బ్యాలెట్ బాక్స్ చెక్ చేసుకోవాలన్నారు. ఆదివారం సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టాలనీ, ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అబ్జర్వర్ ఆదేశాల అనంతరమే ఫలితాలను వెల్లడించాలని కలెక్టర్ ఆదేశించారు.
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందించిన సామాగ్రిని జాగ్రత్తగా సీల్ చేసి డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. సిబ్బందికి సందేహాలు ఉంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేశామని వాటి ద్వారా సందేహాలను నివృత్తి చేసుకొని ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కాగా జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వర్, శ్రీను దామరగిద్ద, మరికల్ పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ / రిసెప్షన్ సెంటర్లను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, ఎం పి డి ఓ లు, తహసీల్దార్లు, ఇతర ఎన్నికల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.