calender_icon.png 12 September, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాశ్వతానంద మార్గం

06-12-2024 12:00:00 AM

ఉపనిషత్ సుధ

జాగ్రత్, నిద్ర, సుషుప్తి అనే మూడు అవస్థలలోనూ ఉన్న ‘నేను’, మనసు ద్వారా కప్ప గెంతులవంటి సంచరించే స్థితిని చూపేదే మాండూక్యం! అత్యంత విలువైన కాలాన్ని తపోభూమికలో గడిపి, తాను పొందిన ఆత్మానుభవాన్ని నిరపేక్షంగా ఈ ప్రపంచానికి అందించే జ్ఞానవరదాన విధానాన్ని ‘మాండూక్యోపనిషత్’ మనకు సుబోధకంగా వివరిస్తుంది. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడూ భిన్నం కావని చెపుతూనే, జీవుడు దేహధారి కనుక పుట్టటం, పెరగటం, ఒరగటం తప్పించుకోలేని స్థితులు.

‘జ’ అంటే పుట్టేది, ‘గత్’ అంటే పోయేది. ఋతువు వెంట ఋతువు. కాలగమనంలో నిరంతరం మార్పు చెందుతూనే, మరణ స్థితిని పొందుతూనే ఈ ప్రకృతి, ప్రపంచం, జగత్తుగా అనుభవంలోకి వస్తున్నది. కనుక జీవ-జగత్తులు అస్థిరమై, అశాశ్వతమై, కంటికి కనిపిస్తూ ఉన్నయ్. ఈ రెండిటి స్థితి ఒకటే! కానీ, జీవజగత్తుల కార్యకలాపాలకు కారణం, ప్రేరణం అయిన జగదీశ్వర తత్త్వం నిత్య, సత్య, శాశ్వత స్థితిలో నిలకడ చెంది ఉన్నది. రూప, నామ భేదం వల్ల జీవుల మూలసూత్రం కంటికి కనిపించక, మనసుకు అనిపించక గందరగోళం ఏర్పడుతుంది. అవస్థలు మూడుగా ఉన్నా, అందులో స్థిమితంగా ఉన్న సద్వస్తువు ఒకటే!

జీవ, జగత్, జగదీశ్వరులు భిన్న రూపాలలో సంచరిస్తున్నా నిజానికి ఈ మూడూ ఒకటే! అటువంటి స్పృహే ‘ఎరుక’! ఈ ఎరుకను సాధించే మార్గాన్ని ‘మాండూక్యోపనిషత్’ సూచిస్తున్నది. మనసు కూడా కప్ప వలె గెంతులు వేస్తూ, అలుపెరుగకుండా, అలసిపోతుంటుంది. కనుక మనసును నియంత్రించి, నిగ్రహించే మార్గం ధ్యానమేనని బోధిస్తూ, ‘మాండూక్యోపనిషత్’ సాధకుణ్ణి ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపిస్తుంది. అకార, ఉకార, మకారములతో కూడి ఉండి, ఒకే అక్షర స్వరూపాన్ని ధరించిన శబ్దమే ‘ఓం!’ అది నాశమెరుగని ఆత్మకు సంకేతం! అదే ప్రణవం! అదే నిజమైన జ్ఞాన మార్గం.

మూడు అవస్థలలోనూ ‘నేను, నేను’ అని శబ్దించే శబ్ద బ్రహ్మం అది. జీవుడి హృద్గుహలో నినదించే అనాహత నాదం! దానిపై నిలిపే ధ్యానమే ఆత్మానుసంధానానికి దారి తీయిస్తుంది. ప్రకృతికి నాదరూపమైన ‘ఓం’ పరమాత్మకంటే భిన్నం కాదు. ఏకం అనేకం కావటం, మళ్ళీ ‘అనేకం’ ఏకం కావటం సృష్టి లక్షణమే. అప్పుడే పుట్టిన కాలం వర్తమానమై, అది నెమ్మదిగా భవిష్యత్తుగా మారి, తిరిగి భూతకాలంగా రూపు దాల్చటమూ ఇటువంటిదే. జాగ్రదావస్థలో విశ్వసుడుగా, స్వప్నావస్థలో తేజసుడుగా, సుషుప్తిలో ప్రాజ్ఞుడుగా ఉండటమూ ఇటువంటిదే!

దేహంలోనే పధ్నాలుగు లోకాలు ఉన్నయ్. శిరస్సు, రెండు కళ్లు, నాసికారంధ్రాలు, చెవులు, నోరు, కరచరణాది అవయవాలు, పొట్ట.... వీటన్నిటితోపాటు స్పర్శ. ఇదంతా సర్వలోకాల సమష్టి వ్యవస్థ. స్థూలంగా కేవల శరీరంగా కనబడుతున్న ఒక కార్యక్షేత్రం! జీవుడు జాగ్రదావస్థలో శరీరంగా లోకానుభవాన్ని పొందుతూ, స్వప్నావస్థలో మానసికంగా విషయాలను నెమరు వేసుకుంటూ, సుషుప్తిలో మనోబుద్ధులు అణగి, అనిర్వచనీయ ఆనందానుభూతిని పొందుతాడు! అయితే ఇది సుఖ, సంతోష, నానా ఆనందాలను దాటిన స్థితే! సమాధి స్థితి కలిగించే ఆనందం అంత్యం, శాశ్వతం. అది ఇంకా బహుదూరంలో ఉన్నది.

ఈ మూడు అవస్థలను దాటిన తరువాత ‘తురీయం’ ఉన్నది. సామాన్యుడు దానిని అందరూ అంతిమ స్థితిగా భావిస్తే శంకర భగవత్పాదులు దానిని ‘తురీయతల్పం’ అన్నారు. అంటే ‘తురీయాని’కి అతీతమైన స్థితి ఉన్నదని సూచిస్తూ, ‘తురీయం’ దగ్గర విశ్రమించిన అనంతరం, పరమ చరమ స్థితిని అందుకోమని బోధిస్తున్నారు.

- వి.యస్.ఆర్.మూర్తి