calender_icon.png 12 September, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని అదానీ రచ్చ

06-12-2024 12:00:00 AM

అదానీ ముడుపుల వ్యవహారం పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదిపేస్తూనే ఉంది. గత నెల 25న శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునుంచి కూడా అదానీ ముడుపుల వ్యవహారంతో పార్లమెంటు కనీసం అరగంట కూడా జరగకుండానే వాయిదాలు పడుతూ వచ్చింది. 

ప్రతిరోజూ ప్రతిపక్ష సభ్యుల వాయిదా తీర్మానాలకు నోటీసులు ఇవ్వడం, స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లు వాటిని తిరస్కరించడంతో గొడవ మొదలు కావడం, ఉభయ సభలు వాయిదా పడ్డం పరిపాటిగా మారింది. పార్లమెంటు వెలుపల కూడా ‘ఇండియా’ కూటమి ఎంపీలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరుపుతూ వస్తున్నాయి.

అయితే ఈ మధ్యలోనే ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో మసీదు సర్వే సందర్భంగా హింస చోటు చేసుకోవడం, అయిదుగురు మృతి చెందడం జరిగింది. ఈ అంశంపై చర్చ జరగాలని అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ ఎంపీలు పట్టుబడుతున్నారు.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్  ప్రతిరోజూ పార్లమెంటు జరక్కుండా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదానీ వ్యవహారం ఒక్కటే కాదని, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలు ఇంకా ఉన్నాయనేది ఆ పార్టీ వాదన.

అంతేకాదు, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతల ధర్నాకు ఈ రెండు పార్టీలు దూరం కావడం మొదలు పెట్టాయి. దీంతో ప్రతిపక్ష కూటమిలో చీలికలు మొదలయ్యాయంటూ వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనూ కొందరు ఎంపీలు పార్లమెంటును స్తంభింపజేయడంపై అసంతృప్తితో ఉన్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి.

ఇది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింపజేయడాన్ని విరమించుకోవాలని నిర్ణయించింది. దీంతో వారం రోజుల తర్వాత   రెండు రోజులుగా పార్లమెంటు సమావేశాలు  కొనసాగుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు అదానీ వ్యవహారంతో పాటుగా సంభల్ హింసపైనా చర్చ జరపాలని గొడవ చేస్తూనే ఉన్నాయి.

మరోవైపు పార్లమెంటు లోపల పట్టు సడలించుకున్నా   ఇండియా కూటమి పార్టీలు పార్లమెంటు వెలుపల ధర్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అదానీ వ్యవహరంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారంకూడా పార్లమెంటు వెలుపల ధర్నా చేపట్టారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ధర్నాలో పాల్గొన్న ఎంపీలంతా కూడా ‘ మోదీ , ఆదానీ ఏక్ హై’ అన్న నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ధర్నాకు  టీఎంసీతో పాటుగా సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎంపీలు దూరంగా ఉండడం గమనార్హం.

అదానీ కన్నా సంభల్ హింస పెద్ద అంశమని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లో లుకలుకల వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు రైతుల డిమాండ్లపై ఈ నెల 6నుంచి ఆందోళనకు సిద్ధమవుతున్న సంయుక్త కిసాన్ మోర్చా సైతం అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు మద్దతు ప్రకటించింది. ఈ వ్యవహారంపై తాము సైతం ఆందోళనకు దిగుతామని ఆ సంస్థ హెచ్చరించడం విశేషం.

 అయితే అదానీ వ్యవహారంపై పార్లమెంటులో చర్చించేందుకు అధికార బీజేపీ ససేమిరా అంటోంది. ఇది ఓ ప్రైవేటు కంపెనీకు, అమెరికా న్యాయశాఖకు మధ్య వ్యవహారమని, ఇందులో తలదూర్చాల్సిన అవసరం లేదనేది ఆ పార్టీ అభిప్రాయం. అంతేకాదు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అదానీ, మోదీలపై ఆరోపణలు చేయడం తప్ప మరే విషయం పట్టదంటూ విమర్శలు గుప్పిస్తోంది.

రాజ్యాంగంపై రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చకు అంగీకరించడం ద్వారా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టింది. ఈ నెల 13, 14 తేదీల్లో లోక్‌సభలో, 16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అదానీ అంశంపై ఏదైనా ప్రకటన చేస్తుందో లేక ఇప్పటిలాగే మౌనం పాటిస్తుందో చూడాలి.