calender_icon.png 7 January, 2026 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

06-01-2026 01:06:50 AM

  1. బకాయిలు చెల్లించాలని డిమాండ్
  2. మా పొట్ట కొట్టొద్దు, న్యాయం చేయాలని ఆందోళన
  3. అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల వేళ పెన్షనర్ల ఆందోళనతో పరిసరాలు దద్దరిల్లాయి. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యోగ సంఘాల నేతలు, రిటైర్డ్ ఉద్యోగులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

అసెంబ్లీ ముట్టడికి పెన్షనర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులు బారికేడ్లను దాటి అసెంబ్లీ గేటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ ఉద్యమకారుడు బక్క జడ్సన్‌తో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతోందని రిటైర్డ్ ఉద్యోగులు మండిపడ్డారు. 2024 నుంచి ప్రభుత్వం పెన్షన్ దారులకు చెల్లించాల్సిన కరువు భత్యం విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రావాల్సిన డీఏలను, ఇతర పాత బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.

జీవితాంతం ప్రభుత్వానికి సేవలందించి రిటైర్ అయ్యాక, తమ హక్కుల కోసం రోడ్లెక్కి పోరాడాల్సి రావడం దురదృష్టకరమని ఆందోళనకారులు వాపోయారు. అసెంబ్లీ సాక్షిగా తమ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. పెన్షన్‌దారుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో అసెంబ్లీ పరిసరాల్లో కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.