18-12-2025 12:00:00 AM
ముషీరాబాద్, డిసెంబర్ 17 విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలవుతున్న రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ అడ్డంకిని తొలగిస్తూ బీసీలకు జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్)ను వారి కార్యాలయంలో కలసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల జనాభా, సామాజిక పరిస్థితులు, రాజకీయ వ్యవస్థలో ఉన్న అసమానతలను పరిగణనలోకి తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆధారిత పూర్తి స్థాయి రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించిన చట్టాలను న్యాయ స్థానాలు రద్దు చేసిన ఉదాహరణలను కూడా మంత్రికి వివరించినట్లు తెలిపారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, జనాభా మేరకు ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య స్పూర్తి అని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలో రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ సముచితమైన విధానం కాదని పేర్కొంటూ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, కొండ దేవయ్య, రాకేష్ దత్తా, ఏకరినివాస్, బచ్చు అవినాష్, జెర్రీ పొతుల పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి హామీ..
రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ అంశంపై ప్రధానితో చర్చించి, రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి తెలిపారు. ఆర్. కృష్ణయ్య నాయకత్వంలోని ప్రతినిధి బృందానికి ఈ మేరకు మంత్రి భరోసా ఇచ్చారు.