18-12-2025 12:00:00 AM
ముషీరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : ముంబై వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడల మొదటి సెలక్షన్ ట్రయల్స్లో తెలంగాణ సెయిలర్లు పతకాల పంట పండించారు. వివిధ విభాగాల్లో పోటీపడిన రాష్ట్ర క్రీడాకారులు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తిని చాటారు. అండర్-18 జూనియర్ స్కిఫ్ విభాగంలో లాహిరి కొమరవెల్లి-ఈశ్వ సూరగాణి గౌడ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇదే విభాగంలో దీక్షిత కొమరవెల్లి-అబ్దుల్ రహీమ్ ద్వయం స్వల్ప పాయింట్ల తేడాతో రజత పతకాన్ని గెలుచుకుంది. సీనియర్ స్కిఫ్ క్లాస్లో తనుజ కామేశ్వర్-ధరణి లావేటి జోడీ రజతంతో మెరవగా, వినోద్ దండు-అరవింద్ మహ్లాట్ బృందం కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. వీరి ప్రతిభను ఎంజేపీటీ కార్యదర్శి బి. సైదులు కొనియాడారు. ప్రస్తుతం ఈ విజేతలు కోచ్ శివప్రసాద్ ఆధ్వర్యంలో సుచరిత అకాడమీలో ఫిట్నెస్ శిక్షణ పొందుతున్నారు.