calender_icon.png 8 July, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు

08-07-2025 02:04:55 AM

 జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం ప్రదర్శించవద్దని జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను హెచ్చరించారు. సోమవారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు.

జీహెఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో కలిపి మొత్తం 200 అర్జీలు అందాయి. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి 74 వినతులు రాగా, వీటిలో అత్యధికంగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి 37 ఫిర్యాదులు వచ్చాయి. జీహెఎంసీ పరిధిలోని ఆరు జోన్లలోనూ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

జోనల్ కార్యాలయాలకు మొత్తం 126 అర్జీలు రాగా, అత్యధికంగా కూకట్‌పల్లి జోన్‌లో 55, శేరిలింగంపల్లిలో 28, సికింద్రాబాద్‌లో 27 చొప్పున అర్జీలు దాఖలయ్యాయి. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని తక్షణమే సంబంధిత అధికారులకు పంపి, సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, వేణుగోపాల్, సత్యనారాయణ, గీత రాధిక, మంగతాయారు, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, సిసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.