17-11-2025 07:57:19 PM
ధాన్యం పంపి 25 రోజులైనా డబ్బులు పడలేదు..
మహిళా రైతు దుర్గమ్మ ఆవేదన..
కొల్చారం: మెదక్ జిల్లా చిన్నఘణపురం గ్రామానికి చెందిన మంగళి దుర్గమ్మ ఈ వర్షాకాలం సీజన్లో తనకు పండిన వడ్లను చిన్నఘనపూర్ సహకార సంఘం ద్వారా 25 రోజుల క్రితం తూకం వేసి రైస్ మిల్లుకు పంపించింది. ఈ వడ్లకు సంబంధించిన డబ్బులు ఇప్పటికీ తన ఖాతాలో జమ కాలేదని సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. “మా వరి ధాన్యాన్ని 25 రోజుల క్రితమే సహకార సంఘం ద్వారా రైస్‌మిల్లుకు ఇచ్చాం. కానీ ఇప్పటికీ మా బ్యాంక్ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు,” అంటూ ఆమె వేదనను సోషల్ మీడియాలో బయటపెట్టడంతో స్థానికంగా హల్చల్ గా మారింది. తూకం వేసి మిల్లుకు పంపిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని జిల్లా కలెక్టర్ చెప్పినా ఆ హామీలు కాగితాలపై, కెమెరాల ముందు మాత్రమే మిగిలిపోయాయని దుర్గమ్మ విమర్శించారు. కాగా, ఈ విషయమై చిన్నఘనపూర్ సహకార సంఘం సీఈవోను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు.