20-10-2025 12:40:01 AM
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పిరెడ్డి
ములకలపల్లి, అక్టోబర్ 19,(విజయ క్రాంతి):గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వo వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ్ల అప్పిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రములోని రాయల్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ 4 వ జిల్లా మహా సభలు ఘనంగా నిర్వహించారు.
గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు చిక్కుల శ్రీను జెండా ఎగురవేసి మహాసభలను ప్రారంభించారు.ఈ మహా సభలో అప్పిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి వాగ్దానాలు అన్ని విస్మరించి పంచాయతీ కార్మికుల పొట్ట కొడుతున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని,ప్రజా పాలన ప్రభుత్వంలో కార్మికులు పస్తులు ఉంటున్నారని పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులందరిని పర్మినెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీ కార్మికులపై అధికారుల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24 వ తేదీన గార్ల మండలం లో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున, సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, దమ్మపేట మండల కన్వీనర్ రఘు,చిక్కుల శ్రీను,యాదగిరి,వెంకటప్పయ్య, గంటా శ్రీనివాసరావు,పోడియం వినోద్,సోడెం కన్నారావు, తదితరులు పాల్గొన్నారు.