calender_icon.png 22 November, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండావాసుల సమస్యలు పరిష్కరించాలి

22-11-2025 12:00:00 AM

ఉదయం 8 గంటలకే  జిల్లా అధికార యంత్రాంగంతో సహా నెల్లికల్ చెంచు వాని తండా సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ గా ప్రజాలవద్దనుండి  ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.ఇంతలో నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్ చెంచు వాని తండాకు చెందిన  ఆదెమ్మ ఒక పిటీషన్‌ను జిల్లా కలెక్టర్‌కు సమర్పించింది. అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్ కార్డులు, వివిధ ధ్రువపత్రాలు లేనందున తమ తాండవాసులందరూ ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని, మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే తమకు ప్రభుత్వ లబ్ధి అందటం లేదని ఉంది. 

ఈ  విషయాన్ని సావధానంగా పరిశీలించిన  జిల్లా కలెక్టర్ ఒక చెంచు  మహిళ సుదూర ప్రాంతం నుండి నల్గొండకు వచ్చి సమస్యలను చెప్పడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నేరుగా నెల్లికల్ చెంచు వాని తండాకే వెళ్లి చెంచు తండావాసుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. వెంటనే నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో మాట్లాడి చెంచులు సమస్యల పరిష్కారానికి నెల్లికల్ చెంచు వాని తాండకి వెల్దామని, అందుకు సమయం కేటాయించాలని కోరారు. అందుకు ఎంఎల్‌ఏ జయవీర్‌రెడ్డి అంగీకరిం చడంతో శుక్రవారం  ఉదయం 8 గంటలకే కలెక్టర్, జిల్లా అధికారులతో సహా శాసన సభ్యులు కుందూరు జయవీర్‌రెడ్డితో కలిసి నెల్లికల్ చెంచుతాండకి చేరుకున్నారు.

ఉదయమే తమ తండా కు వచ్చిన జిల్లా కలెక్టర్, ఎంఎల్‌ఏ లను చూసి చెంచు ప్రజలు సంతోషంతో స్వాగతం పాలికారు. డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల  శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, పంచాయతీరాజ్, అటవీ శాఖల ద్వారా చెంచుల కోసం అమలు చేసే పథకాలను కులం కషంగా చెంచులకు వివరించారు. ఈ సందర్భంగా తండాలో   72 మంది ఆధార్ అప్డేషన్  చేయ గా.. 21 మందికి కొత్త  ఆధార్ కార్డులను  ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డివిజన్ స్థాయి అధికా రులు, మండలాధికారులు ,ప్రజా ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.