22-11-2025 12:00:00 AM
-అధికారుల సమన్వయ లోపం
-బాధితులకు ప్రాణ సంకటం
-నల్లగొండ మున్సిపాలిటీలో విచిత్రం
-నెల రోజులుకు పైగా నిరీక్షణ
నల్లగొండ, నవంబర్ 21 (విజయక్రాంతి) : నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన సుందర్(పేరు మార్చాం) రెండు నెలల క్రితం నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు. అయితే సుందర్ భార్య పలు అవసరాల రీత్యా డెత్ సర్టిఫికెట్ కోసం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో దర ఖాస్తు చేసింది.
15 రోజుల్లో ఇవ్వాల్సిన డెత్ సర్టిఫికెట్.. నెల రోజులు దాటినా ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో ఆమె తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటుంది. ఇన్సూరెన్స్ క్లెయి మ్ తదితరాలకు ఆ బాధిత కుటుంబం దూరమయ్యింది. ఇది ఒక్క సుందర్ భార్య పరిస్థితి కాదు.. ఇలాంటి వారు నిత్యం నల్లగొండ మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం గమనారం.
నల్లగొండ మున్సిపల్ కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. భవన నిర్మాణలకు అనుమతులివ్వడం దగ్గరి నుంచి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వరకు చేయి తడపనిదే ఏ పని జరగట్లేదు. ఏండ్లతరబడిగా ఇక్కడే తిష్ట వేసుకున్న కొంతమంది అధికారులు.. అంతా తామై శాసిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న సిబ్బందిని సైతం ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఏ ఉద్యోగి ఈ మున్సిపల్ కార్యాలయంలో చలామణి కావాలన్నా.. వారిదే పెత్తనం. మున్సిపాలిటీ నుంచి ఏలాంటి ధ్రువపత్రం కావాలన్నా.. త్రుణమో పణమో ముట్టజెప్పాల్సిందే. అసలే ఆస్పత్రి ఖర్చులతో విసిగి వేసారిపోయిన బాధిత కుటుంబాలకు మున్సిపల్ కార్యాలయంలోనూ తిప్పలు తప్పట్లేదు.
మున్సిపల్ సిబ్బంది ఏం చెబుతున్నారంటే..
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. అయితే జనన, మరణాలకు సంబం ధించిన వివరాలను ఆస్పత్రి వర్గాలు వెంటవెంటనే మున్సిపల్ కార్యాలయానికి పంపిం చాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆ వివరాలు పంపించేందుకు ఆలస్యం చేస్తున్నారు. దీంతో సకాలంలో జనన, మరణ ధ్రువీకరణ ప్రతాలను ఇచ్చేందుకు జాప్యం అవు తోంది. జనన, మరణాలకు సంబంధించిన పూర్తి వివరాలు పంపించకుండా.. పేషంట్లు, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆస్పత్రి నుంచి వివరాలతో కూడిన పత్రం ఇచ్చి పంపుతున్నారు. కానీ ఆ వివరాలు మా కార్యాలయానికి పంపడం లేదు. దీంతో జనన, మరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇవ్వడం కుదరట్లేదు.
ఆస్పత్రి వర్గాల వాదన ఇదీ..
జనన, మరణాలకు సంబంధించి వీలైనంత త్వరగానే ఆస్పత్రి నుంచి వివరాలు పంపిస్తున్నాము. కొంత సిబ్బంది కొరత వల్ల జనన, మరణాల వివరాలు మున్సిపల్ కార్యాలాయానికి ఇవ్వలేకపోతున్నాం. అది ఒక్కట్రెండు రోజుల్లో మాత్రమే. దీన్ని సాకు గా చూపి మున్సిపల్ వర్గాలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. కొంతమందిని మున్సిపల్ సిబ్బంది తమకు ఆస్పత్రి వర్గాలు ఇంకా వివరాలు పంపలేదని వెనక్కి పంపుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఆస్పత్రి నుంచి ఆ స్థాయిలో జాప్యమైతే జరగట్లేదు.
ధ్రువప్రతాలు లేక.. పథకాలకు దూరం..
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో మున్సిపల్ సిబ్బంది ఆలస్యం వల్ల కొంతమంది ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుతో పాటు ఆధార్ కార్డు తీసుకోవడం వంటి వాటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డెత్ సర్టిఫికేట్ ఇష్యూలో జాప్యం వల్ల ఇన్సూరెన్స్‌తో పాటు ఇతర స్కీముల్లో ఆర్థిక ప్రయోజనం పొందలేకపోతున్నారు.
అయితే మున్సిపల్ సిబ్బంది మాత్రం డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా చాలామంది ఆయా పథకాలకు దూరమయ్యారు. మరికొంతమంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు, రైతు బీమాకు దరఖాస్తు చేసేందుకు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చూడాలని పలువురు వేడుకుంటున్నారు.