13-01-2026 12:00:00 AM
మేడ్చల్, జనవరి 12 (విజయ క్రాంతి): అర్హులైన వారందరికీ పంట రుణ మాఫీ చేయాలని పలువురు రైతులు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. సొసైటీలలో పంట రుణమాఫీ సగం మందికే చేశారని, మిగతా వారికి చేయలేదని తెలిపారు. మేడ్చల్, డబిల్పూర్, పూడూరు సొసైటీల మాజీ అధ్యక్షులు రణదీప్ రెడ్డి, సద్ది సురేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రైతులు కలెక్టరేట్ కు వచ్చి వినతిపత్రం సమర్పించారు. డబిల్పూర్ సొసైటీలో 668 మందికి అర్హత ఉండగా 341 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మిగతా 300 మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు.
మేడ్చల్ సొసైటీలో 449 మందికి అర్హత ఉండగా 351 మందికి రుణమాఫీ అయిందని మిగతా 129 మందికి రుణమాఫీ కావలసి ఉందని తెలిపారు. పూడూరు ఎఫ్‌ఎసిఎస్ పరిధిలో 650 మందికి అర్హత ఉండగా 210 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, 440 మందికి రుణమాఫీ కాలేదని వారు పేర్కొన్నారు. డబిల్ పూర్ ఎస్బిఐ పరిధిలో 400 పైన రైతులకు రుణమాఫీ కావలసి ఉందన్నారు.
రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తూ రుణాలు చెల్లించలేదని దీంతో ఎకౌంట్‌లు హోల్‌లో పెట్టారని తెలిపారు. అంతేగాక వడ్డీ ఏడు శాతానికి బదులు 11% పడుతుందని తెలిపారు. రుణమాఫీ పథకం తమను అసలుకే మోసం చేసిందని తెలిపారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు స్పష్టం చేశారు.