calender_icon.png 12 January, 2026 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లా పేరును చారిత్రక ఇందూరుగా మార్చడం ఖాయం

10-01-2026 12:00:00 AM

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 

నిజామాబాద్, జనవరి 9 (విజయ క్రాంతి): నిజామాబాద్ పేరును చారిత్రక ఇందూరుగా మార్చడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాం కాలానికి ముందు మన నగరం పేరు ఇందూరు అని ఆ పేరు మార్పుతోనే జిల్లాకు పట్టిన దరిద్రం వదులుతుందని వ్యాఖ్యానించారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని బల్దియా తొలి సమావేశంలోనే పేరు మార్పు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని ధీమా వ్యక్తం చేశాడు. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందకపోవడానికి, నిజాం సాగర్ ఎండిపోవడానికి, నిజాం షుగర్స్ మూతపడటానికి ఆ పేరులోని అరిష్టమే కారణమని ఎంపి విమర్శించారు. గతంలోనే పేరు మార్పు ప్రయత్నం జరిగిందని, ఈసారి అవి పూర్తి చేస్తామన్నారు.

తాను ఎంపీ అయిన తర్వాతే జిల్లాలో పై ఓవర్ల నిర్మాణం సాధ్యమైందని, బోధన్ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి నిద్రలో ఉండటం నట్లే అక్కడ పనులు సాగడం లేదని ఎద్దేవా చేశారు.కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని దానికి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తున్నారని అర్వింద్ పంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ పయనిస్తున్నారని కేంద్రంతో యుద్ధం అంటే తన వినాశనాన్ని తనే కొనితెచ్చుకోవడమేనని హెచ్చరించారు.

అవినీతికి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ పై విచారణకు అనుమతులు ఉన్నా రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులకు లెక్కలు చెప్పుకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీలో సంస్కరణలు తెస్తూ కేంద్రం తెచ్చిన జీ-రామ్-జీ (విబి- రామ్- జీ) చట్టాన్ని స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

దీని ద్వారా సాధారణ ప్రజలకు 120 రోజులు, గిరిజనులకు 150 రోజుల పని కల్పిస్తున్నామని తెలిపారు. పని కల్పించని పక్షంలో నిరుద్యోగభృతి కూడా ఇస్తామని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని వివరించారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడీ స్రవంతి రెడ్డి. నాయకులు పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాగోల్ లక్ష్మీనారాయణ, వ్యాలం రాజు, పుట్ట వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.