12-01-2026 01:17:42 AM
పూర్తి కాకముందే రాకపోకలు.. ప్రమాదాలకు ఆహ్వానం
భద్రతా సూచికలు గల్లంతు.. ఎవరి బాధ్యత.?
ప్రమాదం జరిగితే బాధ్యులెవరు.?
అధికారుల పర్యవేక్షణ శూన్యం
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనం
వెంకటాపూర్, జనవరి11,(విజయక్రాంతి): గత సంవత్సరంలో అకాల వర్షాల కారణంగా రోడ్డు కొట్టుకోపోవడంతో వాహనదారులు, రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వాహనదారులు, రైతులు సంబరపడ్డారు. కానీ ఈ సంబరం కొన్ని రోజుల ముచ్చటలాగా మారింది. ప్రమాదకరంగా మారిన కల్వర్టు నిర్మాణ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట-కొండాపూర్ ఊరవాగు వద్ద చోటుచేసుకుంది.
నిర్లక్ష్యంగా వదిలేసిన నిర్మాణం
లక్ష్మీదేవిపేట కొండాపూర్ మార్గం మధ్యలో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో వాహనదారులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. కాంట్రాక్టర్ ఇచ్చిన గడువులో నిర్మాణం చేయలేక, కోటి రూపాయల కాంట్రాక్టు కొంత నిర్మాణ పనులు చేసి కల్వర్టు ఇరుపక్కల గుంతలు తవ్వించి హుటాహుటిన అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నిర్ణీత గడువులో పూర్తి కావాల్సిన పనులు నెలల తరబడి ఆలస్యం కావడంతో రహదారి పూర్తిగా అసురక్షితంగా మారింది. నిర్మాణ ప్రదేశంలో తగిన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కల్వర్టుపై ఆరోపణలు
వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట-కొండాపూర్ మార్గం మధ్యలో చేపట్టిన కీలక కల్వర్టు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజల ఆవేదన వ్యక్తమవు తోంది. నిర్ణీత గడువులో పూర్తి కావాల్సిన పనులు నెలల తరబడి ముందుకు సాగకపోవడం వల్ల ఈ మార్గం పూర్తిగా ప్రమాద కరంగా మారింది. సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాత్కాలిక ఏర్పాట్లు లేక ఇబ్బందులు
నిర్మాణ ప్రదేశంలో వాహనదారుల భద్రత కోసం బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాత్రి వేళల్లో రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి అజాగ్రత్తే పెద్ద ప్రమాదా నికి దారి తీసే పరిస్థితి నెలకొంది.
అదుపు తప్పితే నరకానికే..
కల్వర్టు పక్కనే లోతైన కాలువ ఉండటంతో వాహనం అదుపు తప్పితే నేరుగా కాలువలో పడే ప్రమాదం ఉంది. ముఖ్యం గా వర్షాకాలంలో నీరు నిలవడంతో రహదారి, కాలువ మధ్య తేడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. స్థానికుల మాటల్లో చెప్పాలంటే, ఇక్కడ వాహనం జారి పడితే ప్రాణా లు కాపాడుకోవడం కష్టమే, అదుపు తప్పితే నరకానికి వెళ్లినట్టే అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అడ్డంగా వాహనం నిలిపివేత
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, నిర్మాణం పూర్తికాకముందే భారీ నిర్మాణ వాహనాన్ని కల్వర్టుపైనే అడ్డంగా నిలిపివేయడం. మార్గానికి అడ్డుగా వాహనం నిలిపేయడంతో వాహనదారులకు ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. వాహనాలను ఇలా నిర్లక్ష్యంగా నిలిపివేయడం వల్ల వాహనదారులకు ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉందని వాహనదారులు వాపోయారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తు న్నాయి.
అధికారుల పర్యవేక్షణ లోపం..
పనులు నిలిచిపోయినా అధికారుల నుం చి స్పష్టమైన స్పందన లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు సంబంధిత శాఖ పర్యవేక్షణ లోపమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నా రా? పనులు ఎప్పుడు పూర్తవుతాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవని వాపోతున్నారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలి
ఈ మార్గం గుండా నిత్యం రైతులు, కూలీలు, పశువుల తోలుబండ్లు, ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తుంటాయి. కల్వర్టు పనులు ఆగిపోవడంతో వ్యవసాయ పొలాలకు వెళ్లడం కూడా కష్టంగా మారిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, ఆగిపోయిన కల్వర్టు నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారుల భద్రత కోసం హెచ్చరిక సూచికలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.