12-08-2025 05:20:39 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): స్వాతంత్ర ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ పాత్ర కీలకమని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాము(AISF District Assistant Secretary Ramu) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మంగళవారం అఖిలభారత విద్యార్థి సమైక్య 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాము యాదవ్ శ్వేత అరుణపతాకాన్ని ఎగురవేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చెర నుంచి మాతృభూమి విముక్తికై 1936 ఆగస్టు 12న ఎఐఎస్ఎఫ్ ఆవిర్భావించి దేశ స్వాతంత్రోద్యమంలో అసమాన పోరాటాలు నిర్వ హించి, ఎంతో మంది విద్యార్థులను త్యాగం చేసిందని కొనియాడారు.
పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన విద్యార్ధి సంఘం స్వాతంత్య్ర అనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 89 సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యారంగ సమస్యలపై చదువు-పోరాడు అంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని అన్నారు. దేశ స్వతంత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసిన జాతీయ విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్ ఒక్కటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపేల్లి రోహిత్,మండల నాయకులు గణేష్, శ్రీకాంత్, మణికంఠ, రవి, కిరణ్ కుమార్, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.