calender_icon.png 15 September, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్య్ర పోరాటంలోనూ స్త్రీల పాత్ర

15-09-2025 01:45:51 AM

-ఆది నుంచే స్త్రీలను గౌరవించడం భారతీయుల నైజం 

-తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు

-పాల్గొన్న లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

-సభావేదికపై కొట్టొచ్చిన మహిళా వివక్షత

హైదరాబాద్, సెప్టెంబర్ 14: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా మహిళలు కీలకపాత్ర పోషించారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఆదివారం ఆయన అధ్యక్షతన జాతీయ మహిళా సాధికార సదస్సు జరిగింది. వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహించారు. ‘మహిళలకు గౌరవం ఇవ్వడం ఆదినుంచి వస్తున్న భారత సాంప్రదాయం. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారు.

సామాజిక బంధనాలను ఛేదించుకుని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. మహిళా శక్తి కారణంగానే భారత్ అద్భుత శక్తిగా అవతరించింది. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదు. అనేక కార్యక్రమాలు చేపడితేనే సాధ్యం అవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశాం’ అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఇక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

ఎన్నో దేశాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయని వివరించారు. ఈ సమావేశంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నియమించిన కమిటీకి ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి చైర్ పర్సన్‌గా ఉన్నారు. 

ఇదేనా మహిళా నాయకత్వం?

ఈ సదస్సు సందర్భంగా వేదికపై ఏడుగురు ఆసీనులు అయ్యారు. వీరిలో కేవలం  ఇద్దరు మాత్రమే మహిళలు ఉండడం శోచనీయం. మిగతా ఐదుగురూ పురుషులే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సాధికారత పేర నిర్వహించిన సభలో మహిళలకు లభించే గౌరవం ఇదేనా అంటూ పలువురు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ సదస్సుకు అనేక రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు హాజరయ్యారు. ఏపీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు కూడా సదస్సులో భాగం అయ్యారు. రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి కూడా పాల్గొన్నారు.