calender_icon.png 28 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌ఆర్ ఆడిషన్ నాలో స్ఫూర్తి నింపింది

28-11-2025 12:38:54 AM

‘ఆర్‌ఆర్‌ఆర్ ఆడిషన్స్ నా కాన్ఫిడెన్స్‌ను నెక్స్ లెవల్‌కు తీసుకెళ్లితే, ‘జిగ్రీస్’ చిత్రం నటుడిగా నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింద’ని అంటున్నారు కృష్ణ బూరుగుల. ఆయన కథానాయకుడిగా నటించిన ‘జిగ్రీస్’ చిత్రం నవంబర్ 14న విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందను దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పట్నుంచి నటనపై ఆసక్తి ఉండేది. ఆ ఇష్టమే ‘అష్టాచెమ్మా’ చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రలో నేను కనిపించేలా చేసింది. నాకు యాక్సిడెంట్ కారణంగా చెయ్యి ఫ్రాక్చర్ అయింది.

అప్పుడే ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం రాజమౌళి ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి, చివరిరోజు వెళ్లా. అలా ఆ సినిమాలో ఓ చిన్న రోల్ చేశా. అది ఎడిటింగ్‌లో పోయింది. అంత పెద్ద సినిమా ఆడిషన్‌లో ఎంపిక కావటం నాలో తెలియని నమ్మకాన్ని పెంచి, ఉత్తేజపరిచింది. ఇక నటుడిగా నిరూపించుకోవాలని ముందుకు సాగుతున్నా. రవిబాబు డైరెక్ట్ చేసిన ‘క్రష్’ హీరోగా నాకు డెబ్యూ మూవీ. తర్వాత ‘మానాన్న నక్సలైట్’ సినిమాలో, హరీశ్‌శంకర్ షో రన్నర్‌గా చేసిన ‘ఏటీఎం’ వెబ్‌సిరీస్‌లో, కొరటాల శివ సమర్పణలో వచ్చిన ‘కృష్ణమ్మ’ చిత్రంలో నటించాను.

ఇవన్నీ నాకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చినవే. ఇక ‘జిగ్రీస్’లో నాది రగ్డ్, చిచోరే పాత్ర. నా రియల్ లైఫ్‌కు పూర్తి భిన్నమైన పాత్ర. స్క్రిప్ట్ తొలిసారి చదవగానే అందులో ఉన్న కొత్తదనం నాకు కనెక్ట్ అయ్యింది. ఆరు నెలల పాటు సినిమా కోసం ప్రిపేర్ అయ్యా. సినిమా చూసిన సందీప్ వంగా అభినందించిన సందర్భం నేను మర్చిపోలేనిది. ఇంకా కథలు వింటున్నా. త్వరలో ఓ సినిమా కానుంది.  ఎన్ని సినిమాలు చేశామనే కన్నా ఎలాంటి పాత్రలు చేశాం.. నటుడిగా ఎలాంటి ప్రభావం చూపగలుగుతున్నామని తెలుసుకుంటే విజయాలు తథ్యం” అన్నారు.