24-12-2025 02:18:57 AM
ఉద్యోగులకు భద్రత కల్పించాలి
మార్చి 10న బస్ భవన్ ముట్టడి
ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయిందని, ఇకనైనా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాం డ్ చేశారు.
మంగళవారం హైదరాబాదులో జరిగిన ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అవుట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రతిపదికగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల శ్రమ ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వస్తున్న కార్మికులకు సింగరేణి కార్మికుల తరహాలో ఆర్టీసీ లాభాల్లో కూడా 30% వాటా ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో సగానికి పైగా బీసీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, బీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు నివ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవాధ్యక్షులు పవన్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బీసీ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని, హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని ఆయనే పిలుపుని చ్చారు.
ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నిరంజన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యో గుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండి జోక్యం చేసుకొని మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో మార్చి 10వ తేదీన బస్సు భవనం వేలాదిమంది కార్మికులతో ముట్టడిస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం సికింద్రాబాద్ జోన్ అధ్యక్షుడు బాలరాజు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు వెంకటేష్‌గౌడ్, కార్యదర్శి బండి స్వామి, రేణుక, మంగమ్మ, రమేష్, దుర్గయ్య, పవన్ కుమార్ యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.