24-12-2025 02:17:14 AM
ఇంటర్ ప్రభుత్వ కాలేజీల్లో ప్రతిరోజూ 90 శాతం మంది హాజరు
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం)తో విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడుతోంది. దీంతో ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థులు నేరుగా కళాశాలలకే వస్తున్నారు. కళాశాలకు రాకపోతే ఆ సమాచారం తెలుగు/ఇంగ్లిషు భాషల్లో తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు వెళుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ కళాశాలల్లో 1,47,465 మంది విద్యార్థులున్నారు. వీరిలో ప్రతి రోజు 90 శాతానికి మంది కళా శాలలకు హాజరవుతున్నారు. బోధన, బోధనేతర సిబ్బం ది హాజరును కూడా ముఖ గుర్తింపు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల హాజరు శాతం మెరుగుపడింది.
ప్రశ్నపత్రాలు తరలించే వాహనానికి జీపీఆర్‌ఎస్..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కేజీబీవీ, సంక్షేమ గురుకులాలల పరిధిలోని కళాశాలల్లో గతంలో ప్రాక్టికల్స్ నిర్వహణ నామమాత్రంగా సాగేది. కానీ ప్రాక్టికల్స్ కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా పేపర్ లీకేజీల నివారణకు తయారీ కేంద్రం నుంచి పరీక్ష కేంద్రం వరకు తరలింపునకు సంబంధించి వాహనానికి జీపీఆర్‌ఎస్ ఏర్పాటు చేసి దానిని మానిటరింగ్ చేస్తారు.
అలాగే విద్యార్థులకు ఇచ్చే పరీక్ష పేపర్, బుక్లెట్ పై కోడ్ ఏర్పాటు చేస్తారు. దీంతో ఏ దశలో ఎక్కడ అది తొలుత స్కాన్ అయింది వెంటనే తెలిసిపోతుంది. నీళ్లలో పడినా తడిచిపోని బుక్‌లెట్‌ను విద్యార్థులు ఈ దఫా ఇవ్వనున్నారు. అలాగే పరీక్ష ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల జారీ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
అన్ని జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ టైం టేబుల్ అమలు చేస్తున్నారు. ప్రిన్సిపాళ్లు దానిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు. టీచింగ్ డైరీ ఆన్‌లైన్ చేశారు. ప్రతి రోజూ ప్రిన్సిపాల్స్ వాటిని పరిశీలించి అప్డేట్ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని రాష్ర్ట స్థాయిలోనూ పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి సెలవు మంజూరు, రద్దుపై మెరుగైనా మెరుగైన సేవలు అందుతున్నాయి.