calender_icon.png 28 November, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను దగా చేసిన పాలకులు

28-11-2025 12:47:49 AM

ఎల్బీనగర్, నవంబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి.....కేవలం 17 శాతమే ఇచ్చి బహుజనులను మోసం చేసిందని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విమర్శించారు.  తెలంగాణలోని బీసీలను పాలకులు నిలువునా దగా చేశారని ధ్వజమెత్తారు. గురువారం  నాగోల్ ఎస్‌ఏ డాంగే భవన్ లో బీసీ ముఖ్య నేతలతో కలిసి ఆయన మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చి మాట తప్పారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్ట శాసనసభ బిల్లును ఆమోదించకుండా బీసీలను మోసం చేశారని ఆరోపించారు. ప్రధాని వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి చొరవ చేయకపోవడం కూడా బీసీలకు నష్టం వాటిల్లిందని తెలిపారు.

కేవలం 22 శాతం మాత్రమే రిజర్వేషన్ తో స్థానిక సంస్థలకు వెళ్లేందుకు ఎన్నికల కమిషన్ ముందుకు రావడంతో ఇటీవల తీసిన రిజర్వేషన్లతో బీసీలకు కేవలం 17శాతం మాత్రమే రిజర్వేషన్ దక్కిందని, ముందుగా ఉన్న 22శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు ఒక్క సర్పం స్థానం దక్కలేదని, కొత్తగూడెం జిల్లాలో బీసీలు లేరా? అని ఆయన ప్రశ్నించారు.

ములుగు జిల్లాలో మొత్తం కేవలం ఐదు సర్పం స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని, మాజీ సీఎం కేసీఆర్ కంటే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి కేవలం 17 శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పించారని మండిపడ్డారు. జనాభాలో సగభాగమైన బీసీలకు సగం వాటా దక్కాల్సి ఉండగా 12,700 గ్రామ పంచాయతీల్లో 6000 గ్రామపంచాయతీలు బీసీలకు దక్కాల్సి ఉండగా కేవలం 2000 గ్రామపంచాయతీలు మాత్రమే బీసీలకు దక్కాయని వివరించారు.

జరిగిన అన్యాయం పట్ల బీసీలు మౌనం విడాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ర్ట సహాయ కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ, గీత పని వారల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డీజీ సాయిల్ గౌడ్, రాష్ర్ట ఉపాధ్యక్షుడు కొండా కోటయ్య, పాలకూరి బాబు ఉన్నారు.