30-04-2025 12:00:00 AM
అమరుల సంస్మరణ సభలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి
ముషీరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధనలో ఉద్యమంలో పాల్గొని అమరులైన కళాకారుల త్యాగం వెలకట్టలేమని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజా ఉద్యమ కళాకారుల సంస్మరణ సభ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు వేముల యాదగిరి, డోలక్ యాదగిరి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, గద్దర్ కుమారులు సూర్యం, దరువు అంజన్న, టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రెటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి బతుల సోమన్న, టీజే ఎఫ్ మోహన్ బైరాగి, కేసిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పాశం యాదగిరి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలలో కళాకారుల పాత్ర మరువలేమనీ తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి తొలి, మలి దశ ఉద్యమాలలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రజలు నిర్వాసితులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం పని చేయాలన్నారు. కళాకారులు అణగారిణ వర్గాలకు మద్దతుగా పాటలు పాడాలని, నోరు లేనోళ్ళకు కళాకారులు గొంతుకగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ షావలి, మార్వాడి సుదర్శన్, కోలా జనార్ధన్, గంగి రాజు, బోగే పద్మా, తదితరులు పాల్గొన్నారు.