30-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రుణమాఫీ, సన్నధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్, వ్యవసాయ అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు సాగు రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని మాదాపురం, గాంధీపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
అలాగే గత ఏడాది భారీ వర్షాలకు తెగిపోయిన నెల్లికుదురు మండలం ఆలేరు చెరువు కట్ట మరమ్మతుకు 49.50 లక్షల రూపాయలతో చేపట్టే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించి, ఖాళీ ఖజానాతో అధికారం అప్పగించిందని, అయినా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వెనకడుగు వేయ కుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
దెబ్బతిన్న చెరువులను మరమ్మతులు చేయడానికి నిధుల మంజూరి, టెండర్లలో కొద్దిగా ఆలస్యం జరిగితే బిఆర్‌ఎస్ నాయకులు రాద్దాంతం చేస్తూ ధర్నాలకు దిగడం తగదన్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్, అధికారులకు రైతులు, గ్రామస్తులు సహకరించి నెల రోజుల్లో గా పనులు పూర్తిచేసే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.