calender_icon.png 30 July, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండ పిండ.. టెక్ దందా!

30-07-2025 01:00:42 AM

‘స్పెర్మ్‌టెక్’ రోతపనులు

యాచకులు, కూలీల నుంచి వీర్యం, అండాల సేకరణ..

అక్రమంగా భారీ స్థాయిలో నిల్వ

  1. హైదరాబాద్‌లోని పలు ఐవీఎఫ్ సెంటర్లకు ఇక్కడి నుంచే సరఫరా
  2. గుజరాత్, ఎంపీ తదితర ప్రాంతాల్లోని ఐవీఎఫ్ సెంటర్లకూ తరలింపు
  3. సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్మ్ టెక్‌లో అధికారుల తనిఖీలు
  4. యజమాని పలమకూరి పంకజ్ సహా ఏడుగురి అరెస్ట్
  5. ‘సృష్టి’సెంటర్ మోసంతో వెలుగులోకి వచ్చిన బాగోతం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): రాజస్థాన్ దంపతుల ఫిర్యాదుతో సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌లో బయటపడిన దందా ఇప్పుడు వీర్యం, అండాల సేకరణ కేంద్రాల గుట్టును రట్టు చేసింది. నగరంలోని పలు టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లు, స్పెర్మ్ క్లినిక్‌లపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని ఇండియన్ స్పెర్మ్‌టెక్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేంద్రం అక్రమంగా వీర్యం, అండాలను సేకరించి నిల్వ ఉంచడంతో సంస్థ యజమాని పంకజ్‌తో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఇండియన్ స్పెర్మ్‌టెక్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిం చారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన భారీమొత్తంలో వీర్యం, అండాల శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సదరు సెంటర్ ఐవీఎఫ్ విధానాలను అక్రమంగా అనుసరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

సాధారణంగా ఎవరి నుంచి సేకరించిన వీర్యం, అండాలు వారికి, లేదా వారి కుటుం బ సభ్యులకు మాత్రమే ఉపయోగించాలి. కానీ ఇతరుల నుంచి సేకరించి లాభాపేక్షతో అక్రమంగా నిల్వ ఉంచడం, రవాణా చేయ డం, వ్యాపారం చేయడం నేరం. తనిఖీల అనంతరం కార్యాలయం నుంచి వీర్యకణాలు, అండాలను సీజ్ చేశారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ నిల్వ చేసిన వీర్యాన్ని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ముఖ్యంగా సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ వంటి సంస్థలకు కూడా ఇక్కడి నుంచే వీర్యకణాలు సరఫరా అవుతున్నట్లు నిర్ధారిం చారు. పోలీసులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే విషయా లు వెలుగులోకి వచ్చాయి. రోజూవారీ కూలీలు, యాచకులు, పాదచారులకు డబ్బు ఆశ చూపించి, వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నట్లు గుర్తించారు. వీర్యకణాల కోసం యువకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, అండాల కోసం యువతులకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు చెల్లిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

జంట నగరాల్లోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లు, స్పెర్మ్ క్లినిక్‌లపై అధికారుల నిఘా పెరిగింది. సృష్టి వ్యవహారం బట్టబయలైనప్పటి నుంచి పోలీసులు ఈ తరహా అక్రమ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియ న్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2016లోనే డాక్టర్ నమ్రత లైసెన్స్‌ను ఐదేళ్ల పాటు రద్దు చేసినప్పటికీ, ఆమె వేరే డాక్టర్ల లైసెన్స్‌ల ద్వారా ప్రాక్టీసు కొనసాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఆగస్టు 28 లోపు పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.