calender_icon.png 28 November, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ శాఖకే మచ్చ తెచ్చిన ఎస్సై

27-11-2025 12:00:00 AM

  1. రికవరీ సొత్తు వాడుకున్న భానుప్రకాష్
  2. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షల వరకు నష్టం
  3.   5 తులాల బంగారం విక్రయం
  4. సర్వీస్ రివ్వాలర్ మాయం.. సస్పెండ్ చేసిన అధికారులు
  5. క్రైమ్ విభాగంలో విధుల నిర్వహణ
  6. అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కలకలం రేపిన ఘటన

హైదరాబాద్ సిటీ బ్యూరో/ముషీరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రక్షక భటుడే భక్షక భటుడయ్యాడు. నేరాలను అరికట్టాల్సిన చేతులే నేరాలకు పాల్పడ్డాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి లక్షలకు లక్షలు తగలేయడమే కాకుండా.. ఏకంగా దొంగల నుంచి రికవరీ చేసిన సొత్తును కాజేయడం, ఆఖరికి ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్ రివాల్వర్‌ను సైతం మాయం చేయడం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టిస్తోంది.

ఈవ్యవహారం పోలీసు శాఖకు తీరని మచ్చ తెచ్చిం ది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో 2020 బ్యాచ్‌కి చెందిన భాను ప్రకాష్ క్రైమ్ విభాగంలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. ఆ ఎస్‌ఐ విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానంటూ తరచూ లీవ్స్ పెట్టేవాడని సమాచారం. కానీ, తెరవెనుక అసలు కథ వేరే ఉంది.

ఎస్‌ఐ భానుప్రకాష్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసగా మారి, దాదాపు రూ. 70 నుంచి రూ. 80 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడటానికి అతను అడ్డదారులు తొక్కాడు. ఇటీవల అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ దొంగతనం కేసులో ఎస్‌ఐ భానుప్రకాష్ 5 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. నిబంధనల ప్రకారం ఆ బంగారాన్ని బాధితులకు అప్పగించాలి.

కానీ, బాధితులతో మాట్లాడి లోక్ అదాలత్‌లో కేసును క్లోజ్ చేయించి, బయటకు వచ్చాక బంగారం ఇస్తానని నమ్మబలికాడు. తీరా కేసు క్లోజ్ అయ్యాక ఆ బంగారాన్ని తానే అమ్మేసుకున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఎస్‌ఐ డ్రాలో ఉన్న బంగారాన్ని తీసుకువెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

సస్పెన్షన్‌లో ఉన్న భానుప్రకాష్ ఇటీవల స్టేషన్‌కి వచ్చి, తనకు ఏపీలో గ్రూప్-2 ఉద్యోగం వచ్చిందని, అందుకే వెళ్లిపోతున్నానని సిబ్బందిని నమ్మించే ప్రయత్నం చేశాడు. తన డ్రాలో ఉన్న 9ఎంఎం పిస్టల్ సర్వీస్ వెపన్ తనకు అవసరం లేదని, దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ను కోరాడు. అయితే స్టేషన్ అధికారుల సమక్షంలో డ్రా తెరిచి చూడగా.. అందులో కేవలం బుల్లెట్లు మాత్రమే లభించాయి.

పిస్టల్ కనిపించలేదు.సీసీ కెమెరాల ను పరిశీలించాలని ఎస్‌ఐ బుకాయించినప్పటికీ, పిస్టల్ ఆచూకీ లభించలేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భానుప్రకాష్, తన సర్వీస్ రివాల్వర్‌ని రాయలసీమ ముఠాలకు గానీ, ఇతర నేరగాళ్లకు గానీ అమ్మేసి ఉంటారా.. అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు.

ప్రస్తుతం భాను ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను మాత్రం పిస్టల్ గురించి తన కేమీ తెలియదని, డ్రాలోనే పెట్టానని వాదిస్తున్నట్లు సమాచారం. బంగారం మిస్సింగ్ పై ఇప్పటికే కేసు నమోదు కాగా, పిస్టల్ మాయంపై ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని తెలుస్తోంది. రివాల్వర్ దొరికిన తర్వాతే పోలీసులు పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.