14-10-2025 01:25:59 AM
తుర్కయంజాల్, అక్టోబర్ 13: కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా ప్రభుత్వాలపై పోరాడతామని సీఐటీయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఎన్‌ఎస్‌ఆర్ నగర్ లోని చలసాని కల్యాణమండపంలో ఈనెల 14, 15తేదీల్లో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ 5వ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ మంగళవారం రోజున రాగన్నగూడ వార్డు కార్యాలయం నుంచి మహాసభ ప్రాంగణం వరకు వేలాది మంది కార్మికులతో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభల్లో మూడేళ్ల కాలంలో జరిగిన కార్యక్రమాలపై సమీక్షిస్తామని తెలిపారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ర్ట కార్యదర్శి పాలడుగు సుధాకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్, డి.జగదీశ్, జిల్లా కమిటీ సభ్యులు ఈ.నర్సింహ, టి.నర్సింహ, సీహె ఎల్లేశ్, తుర్కయంజాల్ మున్సిపల్ నాయకులు ఎం.సత్యనారాయణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.