14-10-2025 01:23:52 AM
బీసీ రిజర్వేషన్లపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
మంత్రుల మధ్య వివాదం చిన్నదే వాటిని పరిష్కరించుకుంటామని వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్లపై వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు కూడా పిటిషన్ వేస్తారని చెప్పారు. మంత్రుల మధ్య వివాదాలు చిన్నచిన్న అంశాలని, సమాచార లోపం వల్లే అవి తలెత్తుతున్నాయని మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు.
సోమవారం ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలోని ఆయన నివాసంలో పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే విషయం ఖర్గేకు వివరించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లుతుందనే విషయం కూడా ఖర్గేకు వివరించినట్లు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షితో పాటు ముఖ్యనేతలతో జూమ్ సమావేశం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలూ లేవని, చిన్న కమ్యూకేషన్ సమస్యనేనని ఆయన చెప్పారు. తమదంతా ఒక కుటుంబమని సీఎం రేవంత్‌రెడ్డి, తాను కలిసి మంత్రుల మధ్య వివాదాలను పరిష్కరించుకుంటామని చెప్పారు.
డీసీసీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తు చేసుకోవాలి
డీసీసీ అధ్యక్షుల ఎంపికలో ఏఐసీసీ నాయత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపికలో సమర్థవంతమైన నాయకత్వానికి పట్టం కట్ట బోతున్నారని సోమవారం ఆయన ప్రకటనలో తెలిపారు.
ఇక ముందు డీసీసీ అధ్యక్షులు పార్టీలో ప్రత్యేక భూమిక వహించబోతున్నారని, సీఈసీ సమావేశానికి వీరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ సజావుగా సాగుతున్నదన్నారు.
డీసీసీ అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం నుంచి ఏఐసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. డీసీసీ పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతలు ఏఐసీసీ పరిశీలకులను కలిసి దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా సూచించారు. సమర్థవంతమైన నాయకులు డీసీసీ అధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉందని చెప్పారు.