ట్వంటీ.. ట్వంటీ!

25-04-2024 02:35:46 AM

టచ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకేపాట

టచ్‌లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు

మాకు టచ్‌లో 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

సీఎం సహా కాంగ్రెస్ నేతలు, మంత్రుల వెల్లడి

ఇంతకూ ఎవరా 20 మంది ఎమ్మెల్యేలు

లోక్‌సభ ఎన్నికల తరువాత ‘మ్యాచ్ ఫలితం’!

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాం తి): రాష్ట్రంలో రాజకీయ ట్వంటీ 20 గేమ్ నడుస్తున్నది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ’20 మంది ఎమ్మెల్యే’ల ఆట రసవత్తరంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య సాగుతున్న ఈ రాజకీయ మ్యాచ్‌లో జంప్ జిలానీలుగా మారబోతున్న ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికిప్పుడు 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కూడా అదేస్థాయిలో.. ఒక సీనియర్ నేత 20 మందిని తీసుకొని బీఆర్‌ఎస్‌లోకి వస్తానని తనతో చెప్పినట్టు ప్రకటించారు. 

ఎవరా 20 మంది?

సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌కు టచ్‌లో ఉన్న ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగు తోంది. రేవంత్ చెప్పిన 20 మంది ఎవరనేది చూస్తే.. ఇప్పటికే కొద్దిమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిసి వెళ్లిన సందర్భాలున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సీఎంను కలిశారు. అయితే తాను పార్టీ మారడం లేదని ఆయన ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలవారీగా చూసుకుంటే.. జిల్లా కు కనీసం ఇద్దరు చొప్పున బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతల తో టచ్‌లో ఉన్నవారిని పరిశీలించిన తర్వాతనే సీఎం రేవంత్‌రెడ్డి ఊ అంటే 20 మంది వస్తారని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

ఎవరు ఆ సీనియర్?

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన సీనియర్ నేతతోపాటు.. 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనే చర్చకూడా జోరుగా సాగుతోం ది. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలా గే తాజాగా బీజేపీలో చేరిన మాజీ బీఆర్‌ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై అను మానాలు వ్యక్తంచేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తానే మంత్రిని అన్నట్టు మాట్లాడారని విమర్శించారు. పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉత్తమ్ మొదటి నుంచి కేసీఆర్‌కు సహాయ సహకారాలు అందిస్తుంటా రనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్ చెప్పిన ఆ సీనియర్ ఈయ నేనా? అనే చర్చ జరుగుతున్నది. 20 మంది ఎమ్మెల్యేల విషయమే తీసుకుంటే సీనియర్ నేత వెంట కొందరైనా వచ్చే అవకాశం ఉంద ని అంచనా. ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి మామూలేనని ఆ పార్టీ నేతలే చెప్తుంటారు. ఇలాంటి అంచనాలతోనే 20 మంది వస్తారని నమ్మకంతో కేసీఆర్ మాట్లాడినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

లోక్‌సభ ఎన్నికల తర్వాతే..

రేవంత్‌రెడ్డి, కేసీఆర్ మొదలు పెట్టిన ట్వంటీ 20 రాజకీయ మ్యాచ్ ఫలితం తేలేది మాత్రం లోక్‌సభ ఎన్నికల తర్వాతే అని విశ్లేషకులు అంటున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఈ ఆట ఫలితం తేలే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ చీలిపోతే ఆ 20 మంది ఎవరనేది బయటపడుతుంది. ఒకవేళ బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలహీనపడితే అందులో నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే 20 మంది బయటకు వస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.