calender_icon.png 28 December, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలోనే హంసపాదు!

28-12-2025 12:11:11 AM

మేడారం మాస్టర్ ప్లాన్ నిర్మాణాల్లో అపశ్రుతి

ప్రాకారాలు ఏర్పాటు చేస్తుం డగా పెచ్చులూడుతున్న రాతిస్తంభాలు

మేడారం, డిసెంబర్ 26 (విజయక్రాంతి): కాకతీయుల కాలంనాటి రామప్ప, వేయి స్తంభాల దేవాలయం తరహాలో మేడారం గద్దెల సాలారం నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించి చేపట్టిన పనులు ఆదిలోనే హంసపాదుగా మారాయని భక్తులు పెదవి విరుస్తున్నారు. మేడా రం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపడుతున్న పనుల్లో అపశ్రుతులు చోటు చేసుకుంటడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సాలారం నిర్మాణ పనులను చేపట్టి ప్రత్యేకంగా తెప్పించిన భారీ క్రేన్‌తో స్వాగత శిలలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొన్ని రాతిశిలలపై ప్రాకారాలు ఏర్పాటు చేస్తుండగా సరిగా కూర్చోక కొన్ని రాతి స్తంభాలు పెచ్చులూడుతున్నాయి. దీనితో భారీ రాతి స్తంభా లు కళాకృతి దెబ్బతిని వన్నె కోల్పోతున్నాయి. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెకు  సమీపంలో స్వాగత తోరణంపై ఏర్పాటు చేస్తున్న దిమ్మె సరిగా కూర్చోక ఓ వైపు మూల అడుగున్నర శిల పెచ్చులూడి పడిపోయింది. అలాగే అంతకుముందు ఆ పక్కనే ఉన్న శిలకు కూడా స్వల్పంగా పెచ్చులుడటంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు మేడారానికి పెరుగుతున్న భక్తుల తాకిడితో మాస్టర్ ప్లాన్ పనుల నిర్వహణకు ఆటంకం కలుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.