calender_icon.png 28 December, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ గెలిచే దమ్ముంది

28-12-2025 12:13:32 AM

రాజీనామాకు రెడీ.. 

కార్యకర్తలే నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు

ఉప ఎన్నిక వస్తే మళ్లీ నాదే విజయం

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 27 (విజయక్రాంతి): ‘నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు వెళ్లేందుకు నేను సిద్ధం. నాకు ఆ ధైర్యం ఉంది. నా వెను క ఉన్న కార్యకర్తలే నాకు ఆ దమ్మూ ధైర్యా న్ని ఇచ్చారు’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం హిమాయత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘మీ అండతోనే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్తే.. ఉప ఎన్నికలో మరోసారి ఘనవిజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

కార్యకర్తల బలమే తన బలమని, ఏ ఎన్నిక వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల తీరుపై దానం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధమైన సీఎం పదవికి గౌరవం ఇవ్వడం బీఆర్‌ఎస్ నేతలు మరిచారు. ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదిస్తూ అగౌరవంగా మాట్లాడటం సరికాదు. ఆ సంస్కృతిని మొదలుపెట్టిందే ఆ పార్టీ వాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై, సీఎంపై ఇష్టారీతిన విమర్శలు చేస్తే.. తాము కూడా అంతే దీటుగా ప్రతివిమర్శలు చేయాల్సి ఉంటుందని, అప్పుడు తట్టుకోలేరని హెచ్చరించారు.