24-01-2026 12:59:26 AM
న్యూయార్క్, జనవరి 23: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా అధికారికగా వైదొలిగింది. అమెరికా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. దేశ అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గతేడాది జనవరి ౨౨న అధికార పగ్గాలు చేపట్టారు. తన పాలనకు సరిగ్గా ఏడాది పూర్తయిన రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొవిడ్ మహమ్మారి కట్టడిలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని, అలాగే చైనాకు అనుకూలమైన నిర్ణయాలను అమలు చేస్తున్నదనే ఆరోపిస్తూ ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
అమెరికా తీసుకున్న నిర్ణయంతో డబ్ల్యూహెచ్‌వో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోనుంది. ఎందుకంటే డబ్ల్యూహెచ్‌వో వార్షిక బడెట్‌లో సుమారు 18 శాతం వాటా అమెరికాదే. మరోవైపు డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా 260 మిలియన్ డాలర్ల (రూ.2,382 కోట్లు) మేర బకాయి పడింది. అయితే.. ఆ బకాయిలు చెల్లించే ఉద్దేశం లేదని ఇప్పటికే అమెరికా స్పష్టం చేసింది.
దీంతో డబ్ల్యూహెచ్‌వో అనివార్యంగా తన వార్షిక ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పరిధిలో ౨౫% ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సిన దుస్థితి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే పోలియో నిర్మూలన, అటు వ్యాధుల నివారణ వంటి ముఖ్యమైన కార్యక్రమాలపైనా ప్రభావం పడనుంది.
బకాయిలు చెల్లించాకే: డబ్ల్యూహెచ్‌వో
డబ్ల్యూహెచ్ నుంచి వైదొలిగినట్లు అమెరికన్ ప్రభుత్వం ప్రకటిస్తే సరిపోదని, సంస్థకు బకాయిపడిన 260 మిలియన్ డాలర్లను చెల్లిస్తే తప్ప డబ్ల్యూహెచ్ నుంచి వైదొలగడం సాంకేతికంగా సాధ్యం కాదని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రియేసస్ ప్రకటించారు. మరోవైపు ఆ బకాయిలపై అమెరికన్ అధికారిక వర్గాలు స్పందిస్తూ.. బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేమీ లేదంటూ కొట్టిపారేయడం గమనార్హం.