30 June, 2026 | 1:43 AM

రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది

30-06-2026 12:00 AM

రైతు బలపడితేనే బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం

కల్లూరులో ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) బ్రాంచి నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కల్లూరు, ఖమ్మం, జూన్ 29 (విజయక్రాంతి): సహకార బ్యాంకులు రైతులకు, గ్రామీణ ప్రజలందరికీ ఆర్థికపరంగా అండగా నిలుస్తూ, పొదుపు, రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు పట్టణంలో సోమవారం ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) కల్లూరు బ్రాంచ్ నూతన భవనాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు మరింత చేరువలో, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కల్లూరులో నూతన భవనంలో డీసీసీబీ శాఖను ప్రారంభించామని తెలిపారు. రైతు సుభిక్షంగా ఉంటేనే సహకార బ్యాంకులు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. రైతుల ఆదాయం పెరిగి, వారు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, తద్వారా మరింత మంది రైతులకు రుణాలు అందించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

ల్లూరు బ్రాంచ్ ఆర్థికంగా బలమైన శాఖగా ఎదగడానికి వ్యాపారవేత్తలు, ప్రజలు తమ డిపాజిట్లను సహకార బ్యాంకులోనే ఉంచేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బ్యాంకు బలోపేతమైతే స్థానిక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్న మంత్రి, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం లభించిందన్నారు.

కల్లూరుకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేస్తూ, త్వరలో ఇంటిగ్రేటెడ్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఆధునిక పరిపాలనా సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు. కల్లూరు మండలంలో సాగునీరు, తాగునీరు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, మౌళిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.

గతంలో మండల కార్యాలయాలు, కళాశాల భవనాలు, నీటి పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మంచి పేరును మరింత పెంచేలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ అవకాశం వచ్చినా ముందుగా సత్తుపల్లి నియోజకవర్గానికి తీసుకురావడానికి కట్టుబడి ఉంటానని  స్పష్టం చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, డిసిసిబి బ్యాంక్ ప్రయివేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే ఋణాలందిస్తున్నట్లు తెలిపారు. రైతులు సకాలంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలన్నారు.

రైతులకు ఎన్ని రకాల రుణాలు వస్తాయో అధికారులు అవగాహన కల్పించాలన్నారు.  ఈ కార్యక్రమంలో డిసిఓ గంగాధర్, ఏసీపీ వసుంధర యాదవ్, బ్యాంక్ సిఇఓ ఎన్. వెంకట ఆదిత్య, డిజిఎం ఎం. సర్వేశ్వర రావు, ఎజిఎం బి. చందర్ రావు, మేనేజర్ ఎం. అనిత, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బాగం నీరజ, కల్లూరు మునిసిపల్ చైర్మన్ ఎం. మోహన్,  ప్రజాప్రతి నిధులు, అధికారులు  పాల్గొన్నారు.