calender_icon.png 1 July, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం

01-07-2025 02:22:29 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, జూన్ 30 : బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. జులై 14న  తుంగతుర్తి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా తిరుమలగిరి మండల కేంద్రంలో సభాస్థలితో పాటు బహిరంగ సభకు ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. గత పదేళ్లుగా ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు.

రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేక పోయారన్నారు. అందువల్ల వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని మండిపడ్డారు. మారుమూల వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గమైన తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు 50 వేలకు తగ్గకుండా ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్డిఓ వేణు మాధవరావు, తహసిల్దార్ హరి ప్రసాద్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా మరియు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.