01-07-2025 02:24:50 AM
-వాస్తవంగా పెట్రోల్ బంకుల్లో వసతులు కరువు
-నిబంధనలకు నీళ్లోదులుతున్న యాజమాన్యాలు
-అవస్థలు పడుతున్నవినియోగదారులు
చిలుకూరు, జూన్ 30 : పేద, మధ్య తరగతి వర్గాలలో అధిక శాతం ప్రజలు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు. పెట్రోల్ బంక్ యజమానులు వినియోగదారులకు విధిగా తాగునీటి వసతి, మరుగుదొడ్లు, గాలి మిషన్ వంటి వసతులు కల్పించాలి. అయితే పట్టణాలతో పాటు కొన్ని ప్రాంతాలలోని బంకులలోనే ఈ వసతులు కల్పిస్తున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే.. :
ఉరుకులు, పరుగుల జీవనంలో ఎక్కువమంది వారికున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు. ఒక్కో ఇంట్లో రెండు, మూడు బైకులు సైతం ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలలో కొంత మెరుగైన ఆదాయం ఉన్నవారు సొంత కారు కలిగి వాడుతున్నారు. ఏ వాహనం నడవాలన్నా వాటిలో పెట్రోల్, డీజిల్ తప్పనిసరి. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వాలు పెట్రోల్ బంకులు ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నాయి.
అయితే పెట్రోల్ బంకులలో కనీస వసతులు కరువ్వడంతో వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిలుకూరు మండల వ్యాప్తంగా ఆరు పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో సగం పెట్రోల్ బంకుల్లో మౌలిక సౌకర్యాలు అమలు కావడం లేదు. పెట్రోల్ బంకులకు అనుమతి మంజూరు చేసేటప్పుడు యజమానులు 10 నిబంధనలు కచ్చితంగా పాటిస్తామని, అన్ని సౌకర్యాలు ఉండే విధంగా బంకులు నిర్వహిస్తామని సంబంధిత అధికారులకు రాతపూర్వక హామీ ఇస్తారు. కానీ అవి కాగితాలకు మాత్రమే పరిమితం అనే విషయం ఏర్పాటు చేసిన తర్వాత గాని అర్థం కావు.
తప్పక కల్పించాల్సిన మౌలిక వసతులు ఇవే..
ప్రధానంగా బంకుల యజమానులు వినియోగదారులకు ఎయిర్ మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపుకునే ఏర్పాటు చేయాలి. బంకు వద్ద ప్రధమ చికిత్స కోసం ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేసి వాటిలో ఉండే మందులపై గడువు తేదీ తప్పకుండా ఉండాలని నిబంధన ఉంది. తాగునీరు, ఉచిత ఫోన్ సౌకర్యం, మరుగుదొడ్లు, ఫిర్యాదు బాక్స్, పెద్ద అక్షరాలతో ధరల పట్టిక, ఫైర్ సేఫ్టీ డివై జర్స్, బిల్లు ఇవ్వడం, క్వాంటిటీ, క్వాలిటీ కోసం ఐదు లీటర్ల క్యాన్ ఇలా ప్రతి బంకులో వినియోగదారులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలకు ఆయా యజమానులు మంగళం పాడుతున్నారు.
మండలంలో ప్రతి పెట్రోల్ బంకులో నామమాత్రపు సౌకర్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొంతమంది వినియోగదారులు వసతుల గురించి ప్రశ్నించగా యజమానులు వారిపై వివాదాలకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. వినియోగదారులు మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి పెట్రోల్ బంకును పూర్తిస్థాయిలో తనిఖీ చేసి పది సౌకర్యాలను పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
బంకులపై పర్యవేక్షణ లేదు
మండలంలో పెట్రోల్ బంకుల పై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది. బంకుల యజమానులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వసతుల గురించి ప్రశ్నించిన వారిపై బంకుల నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో కల్తీ, తక్కువ క్వాంటిటీ కూడా ఉంటుంది. వినియోగదారులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూడడం బాధాకరం.
కందుకూరి కృష్ణమూర్తి, వినియోగదారుడు