01-08-2025 07:53:33 PM
పూసుగూడెం ఉమ్మడి పంచాయితీ కాంగ్రెస్ యువజన నాయకుడు కొండ్రు భాస్కర్..
ములకలపల్లి (విజయక్రాంతి): రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సారధ్యంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన ప్రభుత్వం కొనసాగుతుందని ములకలపల్లి మండలంలోని పూసుగూడెం ఉమ్మడి పంచాయతీ కాంగ్రెస్ యువజన నాయకులు కొండ్రు భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన 'విజయక్రాంతి'తో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ గృహాలు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, సబ్సిడీపై రూపాయలు 500 లకే మహిళలకు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సుమారు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని వివరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అసెంబ్లీలో చట్టం చేసి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని గుర్తు చేశారు.
ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెంటనే చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. అశ్వరావుపేట నియోజకవర్గం పూర్తిగా గిరిజన ప్రాంతమైనప్పటికీ అభివృద్ధిలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గ్రామస్థాయి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.