14-10-2025 08:43:48 PM
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. మంగళవారం వరంగల్ శివనగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సురేఖ పాల్గొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం 200 కోట్ల నిధులను సైతం కేటాయించామన్నారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు భూమి పూజ చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించామన్నారు. త్వరలోనే వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభిస్తామని అన్నారు.
దేశంలో ఎక్కడలేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి స్థానిక ఎన్నికలను అడ్డుకున్నాయని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సోమిరెడ్డి శెట్టి ప్రవీణ్, ఉమా యాదవ్, గోశాల పద్మ, చింతాకుల అనిల్, భోగి సువర్ణ సురేష్, కావేటి కవిత, పల్లం పద్మ, గుండు చందన, అధికారులు డిఆర్ఓ విజయలక్ష్మి, ఉప కమిషనర్ ప్రసన్న రాణి, తహసిల్దార్ లు శ్రీకాంత్, ఇక్బాల్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.